కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అతి తీవ్రమైన కరోనా సమస్యకు ఏపీ మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించలేదన్నారు. మంత్రివర్గం అజెండాలో 33వ అంశంగా కరోనా నియంత్రణను చేర్చారని మండిపడ్డారు. కేవలం 13లక్షల పై చిలుకు వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతులిచ్చారని, రూ.45 కోట్లు మాత్రమే కేటాయించారని ధ్వజమెత్తారు. వందల, వేల కోట్లు దుబారాకు ఖర్చు చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడేండుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యంకంటే జగన్ ప్రభుత్వానికి ఎక్కువేంటని ప్రశ్నించారు.
వివరాలు ఆన్లైన్లో ఉంచండి...
పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ వివరాలు ఎందుకు ఆన్లైన్లో పెట్టలేదని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు. కొన్ని ప్రాంతాల్లో మందులు కూడా దొరకట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరితో బాధ కలిగే... అత్యవసరంగా పొలిట్‌బ్యూరో భేటీ నిర్వహించామని తెలిపారు. కరోనా రెండోదశ చాలా ఉద్ధృతంగా ఉందన్న ఆయన.. ఆస్పత్రుల్లో పడకలు, వెంటిలేటర్ల కొరత ఉందన్నారు. కరోనా రోగులకు తమ పార్టీ తరఫున సాయం చేస్తున్నామని చెప్పారు.
అసత్యాలు సరికాదు...
ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. తమ ప్రజలకు ఇబ్బంది వస్తుందనే ఆందోళనలో తమిళనాడు, ఒడిశా ఉన్నాయని అన్నారు. కొత్త స్ట్రైయిన్ ఎన్440కె దేశమంతా వ్యాపిస్తోందని నిపుణులు అంటున్నారని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం అప్రమత్తత లేకుండా వ్యవహారిస్తోందని ఆరోపించారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్, పడకల కొరత లేదని అసత్యాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.
'కొవిడ్ బాధితులకు పార్టీపరంగా మా వంతు సేవలు అందిస్తున్నాం. 195 మందిని హోం క్వారంటైన్ చేసి ఇంటికే మందులు పంపాం. ఆన్‌లైన్ ద్వారా వైద్య సూచనలు అందించాం. ప్రయోగాత్మక విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. హోం క్వారంటైన్లో సమర్థవంతంగా కొవిడ్ రోగులు కోలుకునేలా చేశాం. ప్రభుత్వానికి ఎన్నో వనరులున్నాయి. వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది'
- చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి: ఏపీకి నడిపే టీఎస్ ఆర్టీసీ బస్సులు నేటి నుంచి బంద్