kodali nani comments on bheemla nayak movie : శత్రువులు, మిత్రుల గురించి కాకుండా ప్రజల గురించే సీఎం జగన్ ఆలోచిస్తారని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. అధికారం ఇచ్చిన ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనే దిశగానే ఆయన పనిచేస్తుంటారని చెప్పారు. సినిమాలన్నింటికీ ఒకే రకమైన షరతులు ఉంటాయన్నారు. తమకు ‘అఖండ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఎంతో.. ‘భీమ్లా నాయక్’ కూడా అంతేనని స్పష్టం చేశారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడారు. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలో జరుగుతున్న చర్చ, సినిమా పెద్దలతో సీఎం జగన్ నిర్వహించిన సమావేశంపై వచ్చిన విమర్శలపై ఆయన స్పందించారు.
ఆ విషయాలన్నీ ‘భీమ్లా నాయక్’ నిర్మాతలకు తెలుసు కానీ..
‘‘ఇప్పుడు పవన్‌కల్యాణ్‌పై తెదేపా నేతలు విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ను సీఎం జగన్ తొక్కేశారని.. పవన్‌పై జగన్ యుద్ధం అంటూ ఏదో జరిగిపోయిందనేలా ప్రచారం చేస్తున్నారు. ఫిబ్రవరి 25న జీవో ఇస్తామని.. సినిమా టికెట్ రేట్లు పెంచుకోమని తమ ప్రభుత్వం, పార్టీ ఎక్కడా చెప్పలేదు. ఇటీవల సీఎంను సినీ పెద్దలు కలిశారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావాలంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలి.. పాన్ ఇండియా సినిమాలకు రేట్లు ఎలా ఉండాలి? తదితర అంశాలపై చర్చ జరిగింది. టికెట్ల ధరలపై కోర్టు నియమించిన కమిటీ, ప్రభుత్వం, సినీ పెద్దల అభిప్రాయం.. ఇలా మూడింటినీ చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు నిర్ణయంపై న్యాయ సలహా కోరి వారి అభిప్రాయం తీసుకోవాలి. న్యాయపరంగా ఎలాంటి అవరోధాలు లేకుండా జీవో ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈలోపు మంత్రి గౌతమ్‌రెడ్డి మరణించడంతో కొంత సమయం పోయింది. ఈ విషయాలన్నీ ‘భీమ్లా నాయక్’ నిర్మాతలకు, సినీ పెద్దలకు, పవన్ కల్యాణ్‌కు తెలుసు. అయినా సినిమాను రాజకీయాల కోసం అర్ధాంతరంగా తేదీని ప్రకటించి.. ఆ తేదీ ప్రకారమే సినిమాను విడుదల చేశారు. తనకోసమే జీవోను ఆలస్యం చేశారనే పరిస్థితికి దిగజారిపోయారు’’
జగన్‌పై ద్వేషంతో పనిచేస్తే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు..
‘‘రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు దారిలో నడవడం సిగ్గుచేటు. సినిమా ఆడినా, ఆడకపోయినా పవన్‌కు ఆర్థికంగా నష్టం లేదు. చంద్రబాబు వెనుకున్న కొంతమందిని శ్రేయోభిలాషులుగా భావించి వారి సలహాలతో ముందుకెళ్తే 2024 ఎన్నికల్లో జనసేనకు 25-30 సీట్లు ఇస్తారు. ఓడిపోయే సీట్లన్నీ మీకే ఇచ్చి చంద్రబాబును సీఎంగానో, ప్రతిపక్ష నేతగానో చేయడానికి మీరు పావుగా ఉపయోగపడతారు. మీరు సీఎం, ఎమ్మెల్యే అవ్వాలనుకునే వ్యక్తుల్ని శ్రేయోభిలాషులుగా పెట్టుకోవాలి. సీఎం జగన్‌పై వ్యక్తిగత ద్వేషంతో పనిచేస్తే మీకూ, చంద్రబాబుకు ఎలాంటి ఉపయోగం ఉండదు’’ అని కొడాలి నాని అన్నారు.
ఆ విషయాన్ని పవన్ మర్చిపోయారా?
నరసాపురం సభలో పవన్ మాట్లాడుతూ ఎంత పెద్దవారైనా వంగివంగి నమస్కారాలు పెడితేనే జగన్ అహం సంతృప్తి చెందుతుందంటూ చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు చిరంజీవిని సీఎం జగన్ తన ఇంటికి ఆహ్వానించారని.. సీఎం సతీమణి భారతి భోజనం పెట్టి పంపించిన విషయాన్ని పవన్ మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ‘‘సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది వ్యక్తిగత సమావేశం కాదు.. సినీ పరిశ్రమకు సంబంధించినది. పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చిరంజీవి ఆధ్వర్యంలో వారంతా బృందంగా వచ్చారు. క్యాంపు ఆఫీస్‌కి కారు వెళ్తుందా?కనీసం సీఎం కారు అయినా వెళ్తుందా?అడ్డంగా బారికేడ్లు ఉంటాయి. సీఎం కూడా ఇంటి నుంచి నడుచుకుంటూ క్యాంపు ఆఫీస్‌కి వస్తారు. మంత్రులు కూడా సెక్యూరిటీ చెక్ తర్వాతే లోపలికి వెళ్తారు. అలాంటిది లోపలికి కారు రానీయకుండా అవమానించారంటూ ఆరోపణలు చేశారు’’
అందర్నీ ప్రేమించే వ్యక్తి చిరంజీవి.. ఆయన గురించి పవన్‌కు తెలియదా?
‘‘తన మన అనే తేడాల్లేకుండా అందర్నీ ప్రేమించే వ్యక్తి చిరంజీవి. ఎవరి దగ్గరైనా ఆయన ఆ రకంగానే ఉంటారు. సీఎంతో సమావేశంలోనూ ‘పరిశ్రమకు మేలు చేసే తల్లిలాంటి స్థితిలో ఉన్నారు.. మీ సహాయ సహకారాలు కావాలని’ అడిగితే దాన్నీ విమర్శించారు. చిరంజీవికి అవమానం జరిగిందంటూ ఆయన అభిమానుల ఓట్లు పొందేందుకు కుటిల ప్రయత్నం చేశారు. తెదేపా వాళ్లు అన్నారంటే ఓకే.. పవన్‌కు చిరంజీవి గురించి తెలియదా?వంగి వంగి నమస్కారాలు అనొచ్చా?నీ కుటుంబం ఈ స్థాయిలో ఉండటానికి కారణం చిరంజీవే కదా!. అలాంటి వ్యక్తిని కొందరితో కలిసి అవమానకరంగా మాట్లాడొచ్చా?వాళ్ల ఉచ్చులో పవన్ పడొద్దు. జగన్‌కు మిత్రుడైన నాగార్జున సినిమాకైనా, రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కల్యాణ్ సినిమాకైనా ఒకటే రూలు ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్లు అమ్మాలని.. ప్రజల్ని లూటీ చేసే పరిస్థితులకు ఒప్పుకోమని.. ఎవరినీ ఉపేక్షించొద్దని అధికారులకు సీఎం ఆదేశించారు. అంతేతప్ప ఎవరి సినిమా అనే తారతమ్యాలు లేవు’’
నూటికి నూరు శాతం మళ్లీ జగనే సీఎం..
‘‘వచ్చే ఎన్నికల్లో వైకాపా ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పి ఓటు అడుగుతాం తప్ప.. ఎవరికోసమో చూసే పరిస్థితి ఉండదు. 2024లో ప్రజల ఆశీస్సులతో నూటికి నూరు శాతం జగనే సీఎం అవుతారు. శ్రేయోభిలాషులుగా ఉన్నట్లు నటిస్తున్న దొంగల మాటలు వినొద్దు. సినిమాలు, రాజకీయాలను వేర్వేరుగా చూడాలి. ప్రతిదాన్నీ రాజకీయాలకు వాడుకోవద్దు’’ అని పవన్‌ను ఉద్దేశించి కొడాలి నాని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: Pk Meet Cm Kcr: రాష్ట్రంలో పీకే పర్యటన... ఆసక్తిగా మారిన సీఎం భేటీ