Kannababu on Ntr Statue: ఏపీ గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం దురదృష్టకరమని.. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. ఇలాంటి ఘటనలు ఎవరు చేసినా తప్పేనన్నారు. బాధ్యులపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలను వైకాపా ఎప్పుడూ ప్రోత్సహించదన్న మంత్రి.. గత ప్రభుత్వ హయంలో విజయవాడ నడిబొడ్డులో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించారన్నారు. ఎన్టీఆర్ అంటే తమకూ అభిమానం ఉందన్న మంత్రి.. ఆయనకు సమున్నత గౌరవం ఇస్తున్నామన్నారు.
గతంలో సీబీఐ రాష్ట్రంలోకి రావొద్దన్నారు..
వంగవీటి రాధపై రెక్కీకి సంబంధించి.. సీబీఐ విచారణ జరపాలన్న తెదేపా నేతల డిమాండ్‌ను మంత్రి తోసిపుచ్చారు. సీబీఐ రాష్ట్రంలోకి రావద్దని గతంలో తెదేపా లేఖ రాసిందని.. ఇప్పుడు సీబీఐ విచారణ ఎలా అడుగుతారన్నారు. రెక్కీపై ఎలాంటి ఆధారమూ లేదని విజయవాడ సీపీ చెప్పారని మంత్రి తెలిపారు. వంగవీటి రాధా అంశాన్ని చంద్రబాబు రాజకీయం కోసం వాడుకుంటున్నారన్నారు.
మిర్చి పంటకు నల్ల తామర పురుగు నివారణ చర్యలు..
నల్ల తామర పురుగు.. మిర్చిని దారుణంగా దెబ్బతీస్తోందని, దీనిపై టెక్నికల్ కమిటీ నియమించి నివారణ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. టెక్నికల్‌గా సాయం అందించాలని కేంద్రానికి లేఖలు రాశామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వల్ల వరి పంటకు నష్టం వాటిల్లుతోందన్నారు. బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలు పండించాలని ప్రభుత్వమే కోరుతోందన్నారు. ప్రభుత్వం అసలు వరి పండించవద్దని చెబుతున్నట్లు.. చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు..
అమరావతిపై భాజపా నేతలకు ప్రేమ ఉంటే.. గతంలో గ్రాఫిక్స్ చేసిన చంద్రబాబును ప్రశ్నించలేదన్నారు. అదేవిధంగా.. రాష్ట్రాభివృద్దిలో మీ భాగస్వామ్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:
TDP PROTEST: ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై ఆందోళనలకు తెదేపా పిలుపు.. నేతల గృహ నిర్బంధం