ఏపీ రాజధాని అంశంపై ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అని స్పష్టం చేశారు. అది పులివెందుల, విజయవాడ కావొచ్చు.. రేపు మరో ప్రాంతం కావొచ్చన్నారు. సీఎం నివాసం ఎక్కడ ఉంటే అదే రాజధాన్న మంత్రి.. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదన్నారు.. మంత్రి గౌతంరెడ్డి. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్హాల్లో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం అనంతరం.. ఈ వ్యాఖ్యలు చేశారు.
'2019లో శాసనసభలో మా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ప్రకారమే మూడు రాజధానులు ఏర్పాటుచేస్తాం. అందులో ఎలాంటి మార్పులు ఉండవు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే మూడు రాజధానులను నిర్ణయించాం. దీని ప్రకారం న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా విజయవాడ, కార్య నిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించాం. నిజానికి రాజ్యాంగంలో రాజధాని అనే ప్రస్తావనే లేదు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని. అది పులివెందుల కావొచ్చు, విజయవాడ కావొచ్చు లేకపోతే వైజాగ్ కావొచ్చు '
- మేకపాటి గౌతంరెడ్డి, ఏపీ ఐటీ మంత్రి
ఇదీచూడండి: TS SCHOOLS REOPEN: రేపు బడులు ప్రారంభిస్తారా లేదా వాయిదా వేస్తారా? సాయంత్రానికి స్పష్టత