ఏపీ ప్రభుత్వం.. పిటిషనర్ పరస్పరం కుమ్మక్కై కోర్టు నుంచి ఆదేశాలు పొందడం న్యాయస్థానాన్ని బాధితురాలి (విక్టిమ్)గా చేయడమేనని ఆ రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇరుపక్షాలు (పిటిషనర్, ప్రభుత్వం) కూడబలుక్కొని న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు పొందితే దాన్ని మూడో వ్యక్తి (థర్డ్‌పార్టీ) సవాలు చేయవచ్చా లేదా అనేది ఆసక్తికరమైన విషయమని పేర్కొంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతి వాటాలు కలిగిన సరస్వతి పవర్ సంస్థకు సున్నపురాయి మైనింగ్ లీజు పునరుద్ధరణకు అనుమతిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలు వేయడానికి అనుమతించాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన లీవ్ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
థర్డ్‌పార్టీ అప్పీలు అర్హతపై ఇరువైపుల న్యాయవాదులు చట్ట నిబంధనలను అధ్యయనం చేసి వాదనలు వినిపించాలని సూచిస్తూ విచారణను జులై 20కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. సరస్వతి పవర్ సంస్థకు గుంటూరు జిల్లాలో సున్నపురాయి మైనింగ్ లీజు పునరుద్ధరణకు అనుమతిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎంపీ రఘురామ కృష్ణరాజు 2021లో హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేశారు. 2019 అక్టోబర్ 15న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును, మైనింగ్ లీజును పునరుద్ధరిస్తూ 2019 డిసెంబర్ 12న ఇచ్చిన జీవో 109 అమలును నిలుపుదల చేయాలని ఆయన కోరారు. ఆ సంస్థకు నీటి కేటాయింపు జీవోను, మైనింగ్ లీజును 30 ఏళ్ల నుంచి 50ఏళ్లకు పొడిగిస్తూ ఇచ్చిన జీవోల అమలును నిలుపుదల చేయాలన్నారు. మంగళవారం విచారణ సందర్భంగా.. అప్పీలు దాఖలు చేయడానికి ఉన్న అర్హత (లోకస్ స్టాండీ) ఏమిటని ఎంపీ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది ప్రజాహిత వ్యాజ్యం కాదని, థర్డ్‌పార్టీ ఎలా జోక్యం చేసుకుంటారని అడిగింది.
'ఫ్రాడ్' వ్యాఖ్యలపై వివాదం: ఎంపీ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. సరస్వతి పవర్ ఇండస్ట్రీలో ముఖ్యమంత్రికి, ఆయన కుటుంబసభ్యులకు వాటా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం, ప్రభుత్వం తరఫు న్యాయవాది ఫ్రాడ్‌గా వ్యవహరించి సరస్వతి పవర్‌కు అనుకూలంగా సింగిల్ జడ్జి వద్ద ఉత్తర్వులు పొందారన్నారు. అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆ వాదనలపై అభ్యంతరం తెలిపారు. సింగిల్ జడ్జి దగ్గర తాను అదనపు ఏజీగా వాదనలు వినిపించానన్నారు. ఆయనే ఓ పెద్ద ఫ్రాడ్‌స్టర్ అని ఎంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బ్యాంకులకు రూ.4వేల కోట్లు ఎగవేశారన్నారు. ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. మరోవైపు సరస్వతి పవర్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రిట్ ఉత్తర్వులపై థర్డ్‌పార్టీ అప్పీలు వేసేందుకు అనుమతిస్తూ పోతే.. వివాదాలకు ముగింపు ఉండదన్నారు. అప్పీలు వేసే అర్హత ఎంపీ రఘురామకు లేదన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. థర్డ్‌పార్టీ అప్పీల్ వేసే అర్హత వ్యహారంలో వాదనలు వినిపించాలంటూ విచారణను వాయిదా వేసింది.
ఇవీ చూడండి: