ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 ప్రధాన పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ... 19 మంది అభ్యర్థులు ఆ రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాన పరీక్ష అనంతరం ప్రకటించిన ఫలితాల్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీపీఎస్సీ(APPSC) కార్యదర్శి, ఐపీఎస్(IPS) అధికారి సీతారామాంజనేయుల ప్రమేయం లేకుండా ఛైర్మన్ ఉదయ్‌భాస్కర్ సారథ్యంలో నిర్వహించేలా ఆదేశించాలని కోరారు. త్వరలో నిర్వహించనున్న ఇంటర్యూ ప్రక్రియను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు.
ఒక పోస్టుకు 50 మందిని మెయిన్స్ పరీక్షకు పిలవాల్సి ఉండగా... ఈ నిష్పత్తిని ఏపీపీఎస్సీ(APPSC) కార్యదర్శి 57కు మార్చారన్నారు. TCS ఇచ్చిన డేటాను ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని కోరారు. చివరి క్షణంలో పరీక్ష మాధ్యమాన్ని మార్చేందుకు అనుమతిస్తూ ఏపీపీఎస్సీ కార్యదర్శి అభిప్రాయం వెల్లడించారన్నారు . కొందరు అభ్యర్థుల పరీక్ష కేంద్రాలను మార్చారన్నారు. ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను డిజిటల్ విధానంలో ఏపీపీఎస్సీ మూల్యాంకనం చేయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీసీఎన్ఎస్ సోమయాజుల వద్దకు విచారణకు వచ్చాయి. ఏపీపీఎస్సీ దాఖలు చేసిన కౌంటర్ కోర్టు రికార్డుల్లోకి చేరకపోవడంతో అన్ని వ్యాజ్యాలపై విచారణను మంగళవారం చేపడతామని తెలియజేస్తూ వాయిదా వేశారు.
ఇదీ చదవండి: Tragedy: రూ.80 లక్షలు ఖర్చు చేసినా.. కుటుంబంలో ముగ్గురు మృతి