జనవరి 23 మధ్యాహ్నం 3 గంటలకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏపీ ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించాల్సిన సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, శాంతిభద్రలు పర్యవేక్షించాల్సిన డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరు కాలేదు. ముందుగానే సమాచారం అందడం వల్లో.. లేక.. ఉన్నతాధికారుల గైర్హాజరుతో ఏం జరుగుతుందో అర్థం కాకనో.. పలు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు సమావేశానికి డుమ్మా కొట్టారు.
సహాయ నిరాకరణ ...
స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితికి ప్రతిబింబం ఇది. ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి.. రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు మరో స్థాయికి చేరింది. ఎన్నికల నిర్వహణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీకి సహాయ నిరాకరణ మొదలుపెట్టింది. నోటిఫికేషన్ కూడా విడుదల చేసి.. ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్న ఈసీకి సహకరించేది లేదన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తోంది. ఎన్నికలను ఎట్టిపరిస్థితుల్లో నిర్వహించాలన్నట్లుగానే ఈసీ ప్రయత్నిస్తుండగా.. వాటిని ఎలాగైనా అడ్డుకోవాలనే ధోరణిలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇవాళ ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకూ జరిగిన పరిణామాలు ఎన్నికలు జరుగుతాయా.. లేదా అన్న ఉత్కంఠను కలగజేశాయి. కోర్టు తీర్పుతో నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఎన్నికలు జరగనిచ్చేది లేదని మొండికేస్తోంది.
పంచాయితీ మొదలైంది అప్పుడే..
రాష్ట్రంలో పంచాయతీలతో పాటు, మండల, జిల్లా పరిషత్ లకు ఎన్నికలు నిర్వహించేందుకు 2020 మార్చిలోనే ఎస్ఈసీ నిర్ణయించింది. మండలపరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావాల్సిన తరుణంలో కరోనా పెరుగుతున్నందున నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించారు. ఇది ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. తమతో సంప్రదించకుండా రమేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సహా.. ప్రభుత్వ పెద్దలంతా రమేష్‌కుమార్ పై మండిపడ్డారు. ఆ తర్వాత ఎస్ఈసీ పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ.. ఆర్డినెన్స్ తెచ్చి.. ఆయన్ను పదవి నుంచి తప్పించారు. రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ను ఆ పదవిలోకి తెచ్చారు. ఆ తర్వాత ఆ రాష్ట్ర హైకోర్టు.. ఆర్డినెన్సును రద్దు చేయడంతో నిమ్మగడ్డ మళ్లీ ఎస్ఈసీగా వచ్చారు. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ.. నిమ్మగడ్డకు అనుకూలంగానే ఫలితం వచ్చింది. అప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ చేసే ప్రతి చర్యకు ప్రభుత్వం అడ్డుతగులుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ఎస్.ఈసీ ప్రకటించినా.. ప్రభుత్వం స్పందించలేదు.
కోర్టుకు నిమ్మగడ్డ...
స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కోర్టుకు వెళ్లారు. ఎన్నికల నిర్వహణకు ఎస్.ఈసీ కి సహకరించాల్సిందేనని కోర్టు చెప్పినా ప్రభుత్వం లక్ష్యపెట్టలేదు. చివరకు ఆయన మరోసారి కోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వం తరపున సీఎస్‌తో సహా.. ముగ్గురు ఐఏఎస్‌లు.. ఎన్నికల కమిషనర్‌ను కలిసి.. తాము ఎన్నికలకు సుముఖంగా లేమంటూ చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉన్నందున ఎన్నికలను వాయిదా వేసుకోవాలని.. ఏపీ సీఎస్, పంచాయతీరాజ్ కార్యదర్శి ఎస్.ఈసీకి లేఖలు రాశారు.
ఎన్నికల షెడ్యూల్ -రద్దు- నోటిఫికేషన్...
ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన ఎస్ఈసీ.. జనవరి 8 న పంచాయతీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిబ్రవరి 5, 9,13, 17వ తేదీల్లో ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చారు. దీనిని ప్రభుత్వం హైకోర్టులో ఛాలెంజ్ చేయడంతో సింగిల్ జడ్జి బెంచ్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. కరోనా వ్యాక్సిన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని .. ప్రభుత్వ వాదన పరిగణనలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించింది. దీనిపై ఎలక్షన్ కమిషన్ డివిజన్ బెంచ్ కు వెళ్లింది. విచారణ జరిపిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎ.కె. గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ .. జనవరి 21న సింగిల్ జడ్డి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం వైద్య సిబ్బందికి మాత్రమే ఇస్తున్నారని.. రాబోయే రోజుల్లో ప్రజలకు విస్తృతంగా వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉన్నందున ఆ లోగా ఎన్నికలు నిర్వహించడమే సబబని బెంచ్ వ్యాఖ్యానించింది. దీనిపై ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే పిటిషన్ లో తప్పులున్నాయని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించడంతో శుక్రవారం విచారణకు రాలేదు. శనివారం నిమ్మగడ్డ నోటిఫికేషన్ జారీ చేశారు.
" ప్రజల చేతికి అధికారం ఇచ్చేందుకే స్థానిక సంస్థలు ఏర్పడ్డాయి. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే అందరం వ్యవహరించాలి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నా వ్యక్తిగత వ్యవహారం కాదు. ఎన్నికలు వాయిదా వేయాలన్న వాదనల్లో హేతుబద్ధత కనిపించట్లేదు. ఎన్నికల నిర్వహణపై గవర్నర్ నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నా. ఏపీ ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సహకరిస్తుందని భావిస్తున్నా. ఈ ఎన్నికల నిర్వహణ కమిషన్‌కు పెనుసవాలే. ఉద్యోగ సంఘాలు భిన్న వాదనలు వినిపించాయి. దేశమంతటా ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో వద్దనడం సరికాదు. ఉద్యోగులు ప్రజాసేవకులు... దానిని విస్మరిస్తే దుష్ఫలితాలు ఉంటాయి. ఎన్నికల సక్రమ నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలి. అవసరమైతే సుప్రీంకోర్టుకు రాష్ట్రంలో పరిస్థితులు వివరిస్తాం. ఈ పంచాయతీ ఎన్నికలు చరిత్రాత్మకం"
- నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఎస్ఈసీ
మేం సహకరించం...
కోర్టు తీర్పు వచ్చినప్పటికీ ఎన్నికలను ఏదో రకంగా అడ్డుకోవడానికే ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడంతో పాటు.. ఎన్నికల నిర్వహణకు తాము సహకరించబోమని చెబుతూనే ఉంది. కిందటి ఏడాది స్థానిక ఎన్నికల సమయంలో విధుల నిర్వహిణలో అలసత్వం వహించారన్న కారణంతో చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో పాటు.. ఏఎస్పీ, డీఎస్పీలతో సహా.. మొత్తం 9మందిని విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎస్ఈసీ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్లు కరోనా వ్యాక్సినేషన్ విధుల్లో ఉన్నారని.. ఆయన ఆదేశాలను పాటించలేమంటూ.. సీఎస్ .. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాశారు. ఇంకోవైపు ఉద్యోగ సంఘాలు కూడా తాము ఎన్నికల విధుల్లో పాల్గొనమని చెబుతూ వస్తున్నాయి.
'మా ప్రాణాలు రక్షించుకునే హక్కు మాకు ఉంది. ప్రాణాలు కాపాడుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ప్రాణాపాయం వస్తే ఎదుటివాణ్ని చంపే హక్కూ ఉంది. మా హక్కును సుప్రీంకోర్టు కాదనదని భావిస్తున్నాం. టీకాలు అందే వరకూ ఎన్నికల విధుల్లో పాల్గొనలేం'
-ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మెన్ వెంకట్రామిరెడ్డి
తర్వాత ఏం జరగనుంది.. ?
రాష్ట్రంలోని తాజా పరిణామాలతో... తర్వాత ఏం జరగనుందన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిర్వహణలో ఆటంకాలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని.. తాము జోక్యం చేసుకుంటామని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇప్పటికే తన తీర్పులో చెప్పింది. కాబట్టి ఈ పరిస్థితిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు నివేదించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. మొత్తం మీద.. ఏపీ ఎస్ఈసీ- ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ పోరు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.