డిమాండ్ల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న ఆశా వర్కర్లను ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కమిషనర్ కె.భాస్కర్, ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్రలతో ఆశావర్కర్ల సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆశాల గౌరవ వేతనం రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంపు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు తదితర అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. ఎన్సీడీసీ సర్వేను ఆశా వర్కర్లతో చేయించటం వల్ల పని భారం పెరిగిందని తక్షణమే తమను సర్వే విధుల నుంచి తప్పించాలని ఆశా వర్కర్ల సంఘం కోరింది. ఆశా వర్కర్ల డిమాండ్లపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రంపచోడవరంలో అధిక ఇంజెక్షన్ డోస్ కారణంగా మృతిచెందిన గర్భిణి (ఆశావర్కర్) ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆశా వర్కర్లకు కొత్త ఫోన్ల పంపిణీపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.
కిడ్నీ వ్యాధితో మరణాలపై ప్రభుత్వం దృష్టి..
కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం గిరిజన తండాల్లో కిడ్నీ వ్యాధులపై ప్రభుత్వం దృష్టి సారించింది. కిడ్నీ వ్యాధితో వరుస మరణాల సంభవించటంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆళ్లనాని అత్యవసరంగా భేటీ నిర్వహించారు. మంత్రి ఆదేశాలతో మండలంలోని 7 గిరిజన గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. సర్వే నిర్వహించే లోపు గిరిజన గ్రామాల్లో అత్యవసర వైద్య సేవలు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
స్వచ్ఛమైన తాగునీటి లభ్యత లేకపోవడంతో కిడ్నీ వ్యాధులకు గురవుతున్నట్టు వైద్యారోగ్య శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. కిడ్నీ వ్యాధి బాధితులకు డయాలసిస్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్‌కు మంత్రి సూచించారు. గిరిజన తండాల్లో మెడికల్ క్యాంపు ఏర్పాటుతో పాటు రక్త పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కిడ్నీ వ్యాధితో మరణాలు నమోదైన ఘటనపై నివేదిక ఇవ్వాలన్నారు.
ఇదీ చదవండి :