ప్రభుత్వంపై తాము యుద్ధం ప్రకటించలేదని ఏపీ పీఆర్సీ సాధన సమితి స్పష్టం చేసింది. స్టీరింగ్ కమిటీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సంఘ నేతలు.. ఉద్యమ కార్యాచరణలో పార్టీలను ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. ఉద్యమం అంటే.. ప్రభుత్వానికి నిరసన తెలిపే కార్యక్రమమన్న నేతలు.. ప్రభుత్వ వైఖరి తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. ఉద్యోగులపై ఇలాంటి ఘర్షణ వాతావరణం ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలపై దుష్ప్రచారం చేస్తున్నారని.. రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. డిమాండ్ల సాధనే ముఖ్యమని.. వ్యక్తిగత విమర్శలు వద్దని చెప్పారు.
"రేపు మధ్యాహ్నం 3 గం.కు సమ్మె నోటీసు ఇస్తాం. స్టీరింగ్ కమిటీ సభ్యులను 12 నుంచి 20 మందికి పెంచాం. మావి గొంతెమ్మ కోరికలు కాదు.. న్యాయమైన డిమాండ్లు. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందికి లబ్ధి జరిగే వరకు పోరాడతాం. మాతో చర్చలకు కమిటీ వేసినట్లు అధికారిక సమాచారం లేదు. కమిటీ పరిధి, నిర్ణయాధికారంపై మాకు స్పష్టత లేదు. రేపు మధ్యాహ్నం 12 గం.కు చర్చలకు పిలిచారు. జీవోల అమలు నిలిపివేస్తూ ఉత్తర్వు ఇచ్చేవరకు చర్చలకు వెళ్లం. జనవరికి డిసెంబరు జీతాన్నే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం." - ఏపీ పీఆర్సీ సాధన సమితి
ఉద్యోగుల స్టీరింగ్ కమిటీ భేటీకి ముందు పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. సామరస్య పూర్వకంగా ప్రభుత్వంతో సంప్రదింపులకు రావాలని మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని చేసిన ప్రయత్నాలు వికటించాయి. మరోవైపు అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని పీఆర్సీ జేఏసీ తీర్మానించింది. ప్రతి జిల్లాకు జేఏసీ తరపున ఒక్కో రాష్ట్రస్థాయి నాయకుడిని పంపాలని నిర్ణయించింది. ఉద్యమం విజయవంతం చేయడానికి నలుగురు నేతలను జిల్లాలకు పంపాలని నేతలు తీర్మానించారు. రోజూ జిల్లాల్లో జరిగిన ఉద్యమంపై స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీలను కలుపుకొని ఉద్యమానికి వెళ్లాలని తీర్మానించారు. విజయవాడ రెవెన్యూ భవన్‌లో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, హృదయరాజు, శివారెడ్డి బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీరావు, ఫణి పాల్గొన్నారు. సచివాలయ సంఘం నుంచి వెంకట్రామిరెడ్డి, ప్రసాద్,అరవ పాల్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి కేఆర్ సూర్యనారాయణ, ఆస్కర్ రావు, కృష్ణయ్య పాల్గొన్నారు.
సంప్రదింపులకు మరో ప్రయత్నం
ఉద్యోగుల సమ్మె ప్రతిపాదన విరమింపజేసేందుకు ప్రభుత్వం మరోసారి ప్రయత్నించింది. చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతల్ని మరోసారి ఆహ్వానించింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాల్సిందిగా జేఏడీ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉద్యోగ సంఘాల నేతలను కోరారు. చర్చల్లో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, పేర్ని నానితోపాటు సీఎస్ సమీర్‌శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల పాల్గొంటారని అన్నారు. ప్రభుత్వ పిలుపుపై స్పందించిన ఉద్యోగ సంఘ నేతలు.. పీఆర్సీ జీవోల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇస్తేనే చర్చలకు వస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: