ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం బలపడి ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది దక్షిణ అండమాన్, హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. మంగళవారంలోపు వాయుగుండంగా మారి, మరింత బలపడి బుధవారానికి దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రభావంతో అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలో గాలుల తీవ్రత పెరుగుతుందని తెలిపారు. డిసెంబరు 1, 2 తేదీల్లో తమిళనాడు తీరం వెంట గాలుల గంటకు 50 కి.మీ. నుంచి 70 కి.మీ వేగంతో వీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆదివారం వరకు ఉన్న సమాచారం ప్రకారం కోస్తాంధ్ర తీరానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.