AP New Cabinet : ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఖరారైంది. ఎన్నో కసరత్తులు.. మరెన్నో సమీకరణాలు.. ఇంకెన్నో కూడికలు, ఎన్నెన్నో తీసివేతల తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం కూర్పు ఫైనల్ అయ్యింది. మొత్తం 25 మందిని కేబినెట్లోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. నూతన మంత్రివర్గం నేడు ఉదయం కొలువుదీరనుంది. గడిచిన మూడురోజులుగా మంత్రివర్గం కూర్పుపై ఎన్నో మంతనాలు సాగించిన సీఎం.. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రానికి తుదిజాబితాను ఖరారు చేశారు. ఇవాళ ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న పార్కింగ్ స్థలంలో.. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా.. మంత్రుల పేర్లను ఖరారు చేసి.. ఈ జాబితాను రాజ్‌భవన్‌కు పంపించారు. గవర్నర్ ఆమోదించారు. ఇప్పటివరకు మంత్రులుగా కొనసాగిన వారిలో 11 మందికి కొత్త కేబినెట్‌లోనూ స్థానం దక్కింది. సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా, బుగన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణస్వామిలకు మరోసారి అవకాశం వచ్చింది. గత కేబినెట్‌లో 44 శాతం మంది.. కొత్త మంత్రివరంలో చోటు దక్కించుకున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు జిల్లా అయిన చిత్తూరు నుంచి అత్యధికంగా ముగ్గురికి కొత్త మంత్రివరంలో చోటు లభించింది.
ఆ 8 జిల్లాల నుంచి ఒక్కరికీ ప్రాతినిథ్యం లేదు..: నూతన మంత్రివరంలో చోటు దక్కించుకున్న వారిలో 8 మంది ఓసీలు, అయిదుగురు ఎస్సీలు, 10 మంది బీసీలు ఉన్నారు. ఎస్టీ, మైనార్టీ వరాల నుంచి చెరొకరికి అవకాశం లభించింది. గత మంత్రి వర్గంలో ముగురు మహిళలు ఉండగా..ఈసారి నలుగురు ఉన్నారు. మొత్తం 26 జిల్లాల్లో 8 జిల్లాల నుంచి ఒక్కరికీ నూతన మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లభించలేదు. అల్లూరి సీతారామరాజు, విశాఖ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల నుంచి ఎవరూ మంత్రులు కాలేకపోయారు.
చిత్తూరు జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం..: కొత్త మంత్రివర్గంలో చిత్తూరు జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఈ జిల్లాలో ముగ్గురికి కొత్త మంత్రివరంలో చోటు దక్కింది. పుంగనూరు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గంగాధరనెల్లూరు నుంచి కె.నారాయణస్వామి, నగరి నుంచి ఆర్‌కే రోజాకు అవకాశం వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ధర్మాన ప్రసాదరావు, పలాస నుంచి సీదిరి అప్పలరాజుకు కొత్త మంత్రివర్గంలో చోటు దక్కింది. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి నియోజకవర్గం నుంచి గుడివాడ అమర్‌నాథ్, మాడుగుల నుంచి బూడి ముత్యాలనాయుడుకు అవకాశం వచ్చింది. కోనసీమ జిల్లాలో అమలాపురం నియోజకవర్గం నుంచి పినిపే విశ్వరూప్... రామచంద్రాపురం నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు అమాత్య యోగం దక్కింది. పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు.. తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణకు అవకాశం వచ్చింది. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు, చిలకలూరి పేట నుంచి విడదల రజినికి అవకాశం వచ్చింది.
విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణకు.. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం నుంచి పీడిక రాజన్నదొరకు మంత్రి పదవి దక్కింది. కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గం నుంచి దాడిశెట్టి రాజా... తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గం నుంచి తానేటి వనిత... కృష్ణా జిల్లా పెడన నుంచి జోగి రమేష్, బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి మేరుగ నాగార్జున, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి ఆదిమూలపు సురేష్‌కు అవకాశం వచ్చింది. నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నుంచి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. వైఎస్‌ఆర్ జిల్లాలో కడప నియోజకవర్గం నుంచి అంజాద్ బాషాకు... నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి... కర్నూలు జిల్లాలో ఆలూరు నుంచి గుమ్మనూరు జయరామ్. అనంతపురం జిల్లాలో కల్యాణదుర్గం నుంచి ఉషశ్రీ చరణ్‌కు కొత్త మంత్రివర్గంలో చోటు దక్కింది.
సుచరిత బదులుగా అతనికి చోటు..: ఎస్సీ సామాజిక వర్గం నుంచి గత మంత్రివర్గంలో ఒక్కరికీ మినహా అందరికీ చోటు దక్కింది. ఎస్సీ సామాజికవరం నుంచి గత మంత్రివరంలో పినిపే విశ్వరూప్, తానేటి వనిత, మేకతోటి సుచరిత, కె.నారాయణస్వామి, ఆదిమూలపు సురేష్ కొనసాగారు. వీరిలో ఒక్క సుచరిత మినహా మిగతా నలుగురికీ కొత్త మంత్రివర్గంలో చోటు లభించింది. నూతన మంత్రివర్గంలోనూ ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు అయిదుగురే ఉండనున్నారు. సుచరిత బదులు మేరుగ నాగార్జునకు చోటు దక్కింది.
ప్రభుత్వంలో కీలక ప్రాధాన్యం ఆ సామాజికవర్గానిదే..: ప్రభుత్వంలో కీలక ప్రాధాన్యం లభిస్తున్న ఓ సామాజికవర్గం నుంచి గత మంత్రివరంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బుగన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. వీరిలో మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇటీవలే మరణించారు. ఈ వర్గం నుంచి ఈసారీ నలుగురికి అవకాశం లభించింది. పెద్దిరెడ్డి, బుగ్గనలకు కొత్త మంత్రివర్గంలోనూ చోటు దక్కింది. కొత్తగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆర్‌కే రోజా స్థానం దక్కించుకున్నారు. మరో ముఖ్యమైన సామాజికవరానికి చెందిన కురసాల కన్నబాబు, పేర్ని నాని, అవంతి శ్రీనివాసరావు, ఆళ్ల నాని గత కేబినెట్‌లో కొనసాగారు. వీళ్లెవరికీ కొత్త కేబినెట్‌లో అవకాశం రాలేదు. వారికి బదులు అదే వరం నుంచి గుడివాడ అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబులకు చోటు దక్కింది. ఈ నలుగురూ కొత్త ముఖాలే.
ఆ సామాజిక వర్గాల నుంచి ఏ ఒక్కరికీ చోటు లేదు..: కొత్త మంత్రివర్గంలో రాష్ట్రంలోని ప్రధానమైన ఓ నాలుగు సామాజిక వర్గాల నుంచి ఏ ఒక్కరికీ చోటు లభించలేదు. గత మంత్రివరంలో కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆయా వర్గాల నుంచి కొనసాగగా.. కొత్త కేబినెట్‌లో ఆ ముగురి సామాజికవర్గాలకూ పదవులు ఇవ్వలేదు. ఇంకో సామాజికవర్గానికి పాత, కొత్త కేబినెట్లు రెండింటిలోనూ ప్రాతినిధ్యం లభించలేదు.
సుదీర్ఘ కసరత్తు: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై మూడు, నాలుగు రోజుల నుంచి సీఎం కసరత్తు చేస్తున్నారు. శుక్ర, శనివారాలు రెండు రోజులూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపించుకుని చర్చించారు. ఈరోజు (ఆదివారం) ఉదయం నుంచి జాబితాపై కసరత్తు జరుగుతోంది. తుది జాబితాను గవర్నర్‌కు పంపేవరకూ అందులోని పేర్లు బయటకు రాకుండా గోప్యత పాటించారు.
సామాజిక సమీకరణలే ప్రధానం : కొత్త మంత్రివర్గం కూర్పులో మొదటి నుంచీ సామాజిక వర్గాల సమీకరణలే ప్రధానంగా నిలుస్తాయనే చర్చ సాగింది. ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక సమతుల్యతను పాటిస్తున్నట్టు చెప్పారు. అనుకున్నట్టుగానే.. కుల సమీకరణాలతోనే మంత్రివర్గం కూర్పు జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సజ్జలే కీలకం : మంత్రివర్గ కూర్పులో సజ్జల కీలకంగా వ్యవహరించారనే చర్చ సాగుతోంది. గత మూడు రోజులుగా ఈ విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం పలు దఫాలుగా చర్చించారనే వార్తలు వచ్చాయి. ఈరోజు (ఆదివారం) కూడా సజ్జలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం సజ్జలే మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ, సామాజిక సమీకరణాలతోపాటు.. కొత్త మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే విషయంపైనా సీఎం సజ్జలతో కలికే ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయినవారికి గౌరవం తగ్గకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. మొత్తంగా కేబినెట్ కూర్పులో సజ్జల పాత్ర కీలకంగా మారిందని సమాచారం.
మంత్రి పేరు | జిల్లా | సామాజిక వర్గం |
ధర్మన ప్రసాద రావు | శ్రీకాకుళం | వెలమ |
సీదిరి అప్పలరాజు | శ్రీకాకుళం | మత్స్యకార |
బొత్స సత్యనారాయణ | విజయనగరం | తూర్పు కాపు |
రాజన్న దొర | పార్వతీపురం | ఎస్టీ |
గుడివాడ అమర్‌నాధ్ | అనకాపల్లి | కాపు |
ముత్యాలనాయుడు | అనకాపల్లి | కొప్పుల వెలమ |
దాడిశెట్టి రాజా | కాకినాడ | కాపు |
పినిపె విశ్వరూప్ | కోనసీమ | ఎస్టీ |
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ | కోనసీమ | బీసి - శెట్టి బలిజ |
తానేటి వనిత | తూర్పుగోదావరి | మాదిగ - ఎస్సీ |
కారుమూరి నాగేశ్వరరావు | పశ్చిమ గోదావరి | యాదవ - బీసీ |
కొట్టు సత్యనారాయణ | పశ్చిమ గోదావరి | కాపు |
జోగి రమేష్ | కృష్ణా | గౌడ - బీసీ |
అంబటి రాంబాబు | పల్నాడు | కాపు |
మేరుగ నాగార్జున | బాపట్ల | ఎస్సీ |
విడదల రజని | గుంటూరు | బీసీ |
కాకాణి గోవర్దన్ రెడ్డి | నెల్లూరు | ఓసీ - రెడ్డి |
అంజద్ బాషా | కడప | మైనార్టీ |
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి | నంద్యాల | ఓసీ - రెడ్డి |
గుమ్మనూరు జయరాం | కర్నూలు | ఓసీ - బోయ |
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | చిత్తూరు | ఓసీ - రెడ్డి |
నారాయణ స్వామి | చిత్తూరు | ఎస్సీ |
ఆర్ కే రోజా | చిత్తూరు | ఓసీ - రెడ్డి |
ఉషా శ్రీ చరణ్ | అనంతపురం | కురుమ- బీసీ |
ఆదిమూలపు సురేష్ | ప్రకాశం | ఎస్సీ |
ఇదీ చదవండి: AP cabinet agitation: వైకాపాలో మంత్రివర్గ చిచ్చు.. ఆశావహుల నిరసన జ్వాలలు