ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిలిపివేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
షెడ్యూల్‌పై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం సహేతుకంగా లేదని అభిప్రాయపడింది. ఎస్‌ఈసీ నిర్ణయం ఆర్టికల్స్ 14, 21ను ఉల్లంఘించినట్లు ఉందని పేర్కొంది. ప్రభుత్వం తరపున రెండు గంటలపాటు అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఏకకాలంలో ఎన్నికలు, కరోనా వ్యాక్సినేషన్ కష్టమని వాదించారు. ఏపీ హైకోర్టు తీర్పుపై డివిజనల్ బెంచ్‌కు వెళ్లాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది.
అసలేం జరిగింది..
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు శుక్రవారం షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగోదశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 5న తొలిదశ ఎన్నికలు, 7న రెండో దశ, 9న మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు.
షెడ్యూల్‌పై హైకోర్టుకు ప్రభుత్వం..
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తూ ఎస్‌ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్, ఎన్నికల ప్రవర్తన నియమావళి విధింపు, బదిలీలపై నిషేధం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం... శనివారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఎన్నికల విషయంలో ముందుకెళ్లకుండా ఈసీని నిలువరించేలా ఆదేశించాలని.... ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏపీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం... ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.