గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇక విధిగా ఆస్తి పన్ను విధించి, వసూలు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు వివిధ కారణాలతో కొన్ని ఇళ్లకు పన్ను వేయకపోవడం, వేసినచోట సరిగా వసూలు చేయకపోవడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో పంచాయతీ కార్యదర్శులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల మ్యాపింగ్, గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికత అభివృద్ధి (స్వమిత్వ), జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏపీవ్యాప్తంగా సర్వే చేస్తున్నాయి. తొలి దశలో ఆరు వేల గ్రామాల్లో డ్రోన్ సర్వే చేయాలన్న లక్ష్యంలో ఇప్పటివరకు 741 చోట్ల పూర్తయింది.
వీటిపై గ్రామ సచివాలయాల్లోని సిబ్బందితో ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలన చేయిస్తున్నారు. సర్వేలో గుర్తించిన ఇళ్లు, స్థలాలు, ఖాళీ భూములు, చెరువులకు సంబంధించిన పొడవు, వెడల్పు కొలతలు తీస్తున్నారు. ప్రైవేట్ ఆస్తులపై హక్కులను నిర్ధారిస్తూ సంబంధీకులకు హక్కు పత్రాలు జారీ చేస్తారు. ఇదే సమయంలో ఇళ్లు, స్థలాలకు ఇప్పటికే పన్ను విధించి ఉంటే తాజా కొలతల ప్రకారం సరిచేస్తారు. ఇప్పటికీ పన్ను వేయకుంటే కొత్తగా విధిస్తారు. ఏపీవ్యాప్తంగా 13,371 గ్రామ పంచాయతీల్లో మూడు దశల్లో 2024 నాటికి డ్రోన్ సర్వే పూర్తి చేస్తారు. మరోవైపు సర్వే పూర్తయిన చోట్ల దస్త్రాల్లో ఎక్కని ఇళ్లకు పన్ను విధిస్తారు. ఇందుకోసం ఇంటి పన్ను పేరుతో ప్రత్యేకంగా మాడ్యూల్ రూపొందించారు.
పెరగనున్న అసెస్‌మెంట్లు
సర్వేతో గ్రామాల్లో ఆస్తిపన్ను అసెస్‌మెంట్ల సంఖ్య మరో 20 లక్షలు అదనంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 80 లక్షల ఇళ్లకు పన్ను విధించారు. ఏపీవ్యాప్తంగా రూ.900 కోట్ల డిమాండ్లో ఏటా 60 నుంచి 70% ఆస్తి పన్ను వసూలవుతోంది. సర్వే పూర్తయ్యేలోగా కొత్త అసెస్‌మెంట్లతో ఆదాయం కూడా రూ.50-70 కోట్లు పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇదీచూడండి: AP CM JAGAN: కేంద్ర జలశక్తి నోటిఫికేషన్లో మార్పులు అవసరం