కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి(Solar Energy Corporation of India) ఇచ్చిన ఆఫర్ మేరకే సౌర విద్యుత్ ను యూనిట్ ను 2.49 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇందన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ (Andhra Pradesh Energy Secretary Srikanth news) స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు పై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని ..ప్రభుత్వ సేవకుడిగా తాను అమలు చేశామని తెలిపారు. ఈఆర్సీ ఆమోదం అనంతరమే సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని తెలిపారు.
కేంద్ర ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం కాబట్టి.. జుడిషియల్ ప్రివ్యూకు.. రివర్స్ టెండరింగుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2.49 రూపాయలకు అదనంగా నెట్ వర్క్ ఛార్జీల కింద యూనిట్ పై సుమారుగా రూ. 1.61 రూపాయలు ఉండే అవకాశాలున్నట్లు తెలిపారు. అయితే డిస్కంలపై పడే నెట్ వర్క్ చార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం గడిచిన సెప్టెంబరులోనే సెకీ నుంచే 2.61 రూపాయలకు విద్యుత్ కొనుగోలు చేసిందని, 2.49రూపాయల కంటే కంటే తక్కువగా ఏ ఇతర రాష్ట్రానికీ సెకీ ఇచ్చినట్లు ప్రభుత్వ దృష్టిలో లేదన్నారు. ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చిందన్నారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్లాంటు నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఎవాక్యువేషన్ లైన్లు వేయాల్సి ఉంటుందని, సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం కాబట్టి.. ఇప్పుడు ఎవాక్యువేషన్ లైన్ల ఖర్చు ఉండదన్నారు. విద్యుత్ కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే... ప్రభుత్వ ఉద్యోగిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. తాను గవర్నమెంట్ కాదని.... గవర్నమెంట్ సర్వెంటును మాత్రమేనన్నారు..
'రూ.2.49కి సెకి ఆఫర్ ఇచ్చింది.. ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర సంస్థ సెకి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. ఈ అంశాల్లో జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ అవసరం లేదు.ఈఆర్సీ ఆమోదం అనంతరమే సెకితో ఒప్పందం చేసుకున్నారు. ఛేంజ్ ఆఫ్ లా ప్రకారం ఛార్జీలు పెరిగినా కొనుగోలుదారుడే భరిస్తారు. ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయాలను ఉద్యోగిగా నేను అమలు చేయాలి. నేను ప్రభుత్వాన్ని కాదు.. ప్రభుత్వ ఉద్యోగిని మాత్రమే' - నాగులపల్లి శ్రీకాంత్ ,ఇంధన శాఖ కార్యదర్శి
విద్యుత్ కొనుగోలుపై తెదేపా ఆరోపణలు..
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు అంశంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. తొమ్మిదివేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కేంద్ర సౌర విద్యుత్ సంస్థ (సెకి)తో ఒప్పందం వెనుక భారీ కుంభకోణం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అది రైతుల కోసం అమలు చేస్తున్న స్కీం కాదని... అదానీకి రూ.వేల కోట్లు దోచిపెట్టేందుకు చేస్తున్న స్కామ్ అని మండిపడ్డారు. ‘‘సెకి 2020 నవంబరు, డిసెంబరు నెలల్లో సౌర విద్యుత్ ప్లాంట్‌ల ఏర్పాటుకి టెండర్లు పిలిస్తే... యూనిట్ విద్యుత్ రూ.2కి, గుజరాత్ ప్రభుత్వం పిలిచిన టెండర్లలో యూనిట్ రూ.1.99కే తక్కువ ధరకు బిడ్లు దాఖలయ్యాయి. అదే సెకితో రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ రూ.2.49కి కొనేందుకు ఒప్పందం చేసుకుంది. పైగా దేశంలోనే అతి తక్కువ ధరకు విద్యుత్ కొన్నామని, దానితో రాష్ట్రానికి లాభమేనని ప్రజల్ని మోసగిస్తోంది...’’ అని కేశవ్ ధ్వజమెత్తారు. ఒక పక్క యూనిట్ రూ.1.99కే వస్తుంటే... ప్రభుత్వం రూ.2.49కి కొనడం ఏ విధంగా లాభదాయకం? అని ఆయన ప్రశ్నించారు. యూనిట్ విద్యుత్ రూ.2.49కి కొన్నట్లు ప్రభుత్వం చెబుతున్నా... కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు వెనక్కు తీసుకుంటే డిస్కంలకు చేరేసరికి దాని ధర రూ.3.50 నుంచి రూ.4.50 వరకు పడుతుందన్నారు. ఈ ఒప్పందం వల్ల వచ్చే 25 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలపై రూ.1.20 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన వెల్లడించారు.
అయితే పయ్యావుల కేశవ్ ఆరోపణలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న డిస్కంలపై ఎలాంటి భారం ఉండదని, ఈ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘'ఈ పథకం కింద తీసుకునే విద్యుత్‌కు 25 ఏళ్ల పాటు అంతర్రాష్ట సరఫరా ఛార్జీల (ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ సప్లై ఛార్జీలు- ఐఎస్‌టీఎస్) మినహాయింపు వర్తిస్తుంది. బయటి ప్రాంతాల్లో సౌర ప్రాజెక్టుల ఏర్పాటు వల్ల ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయటానికి అవసరమైన సబ్‌స్టేషన్లు, ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలాంటి మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల రాష్ట్రంలో ప్రాజెక్టు ఏర్పాటు చేసే దానికంటే తక్కువ ధరకే విద్యుత్ అందుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సెకి ప్రతిపాదనపై అపనమ్మకాన్ని కలిగించే కారణం ఏదీ ప్రభుత్వానికి కనిపించలేదు'...’’ అని మంత్రి బాలినేని పేర్కొన్నారు. ఇదే అంశంపై ఇవాళ ఇందన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ మీడియా సమావేం నిర్వహించి.. వివరాలను వెల్లడించారు.డిస్కంలపై పడే నెట్‌వర్క్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: CM KCR on Petrol Price: పెట్రోల్, డీజిల్‌పై నయా పైసా తగ్గించేది లేదు..