AP CM ys Jagan Visits Sarada Peetam: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని చినముషిడివాడలో ఉన్న శారదాపీఠం వార్షికోత్సవాలకు ఆ రాష్ట్ర సీఎం జగన్ హాజరయ్యారు. రాజశ్యామల యాగం కోసం సీఎంతో పండితులు సంకల్పం చేయించారు. అనంతరం అమ్మవారికి జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత శారదాపీఠంలోని విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాలను సీఎం సందర్శించారు. ఆ తర్వాత జగన్ చేతుల మీదుగా కలశ స్థాపన చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణత పత్రాలు, పతకాలను ఏపీ సీఎం అందజేశారు.ఈ పర్యటనలో ఏపీ మంత్రులు వెల్లంపల్లి, అవంతితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
టీఎన్ఎస్ఎఫ్ నేతల అరెస్ట్..
Tnsf leaders arrest: ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో విమానాశ్రయం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ఎయిర్ పోర్టులోకి అనుమతించారు. ఆ రాష్ట్ర సీఎం పర్యటనను అడ్డుకునేందుకు టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులు యత్నించటంతో వారిని అరెస్టు చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ సహా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. తెదేపా ప్రధాన కార్యాలయం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు.
మంత్రి అప్పలరాజుకు చేదు అనుభవం..!
seediri appala raju: మరోవైపు విశాఖలోని శారదాపీఠం వద్ద ఏపీ మంత్రి అప్పలరాజు అనుచరులు ఆందోళన చేపట్టారు. అప్పలరాజుపై సీఐ దుర్భాషలాడారంటూ ఆయన అనుచరులు నిరసనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. జగన్ ఇవాళ శారదాపీఠం సందర్శన సందర్భంగా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఏపీ మంత్రి అప్పలరాజు పీఠంలోనికి తన అనుచరులతో వెళ్లడానికి ప్రయత్నించారు.
శారదాపీఠం వద్ద విధుల్లో ఉన్న సీఐ తనను లోపలికి వెళ్లనీయకుండా దుర్భాషలాడారని అప్పలరాజు ఆరోపించారు. దీంతో కలగజేసుకున్న పోలీసు ఉన్నతాధికారులు మంత్రికి సర్దిజెప్పారు. తనను అంటే ప్రభుత్వాన్ని అన్నట్లేనని.. సీఐతో తనకు క్షమాపణలు చెప్పించలేదని మంత్రి మండిపడ్డారు. ఈ విషయంలో హోంమంత్రి సుచరిత వద్ద తేల్చుకుంటానన్నారు. సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన మంత్రి.. కొద్దిసేపు గేటు వద్దే ఉండి అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి : బిల్లులు రావట్లేదని వార్డు సభ్యుడు వినూత్న నిరసన