గతంలో సినిమాల్లో రాణించాలంటే ఎంతో కష్టపడాలి. లేకపోతే పెద్దల అండదండలు కావాలి. ఇప్పుడు ట్రెండ్ మారింది. లఘుచిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు యువత. మంచి లఘుచిత్రాలు తీస్తుంటే అవకాశాలు వాటంతటవే... తలుపు తడుతున్నాయి. అలాంటి లఘుచిత్రాలతోనే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన పవన్ రాజ్.
పవన్‌రాజ్ హైదరాబాద్‌లో ఉపాధ్యాయుడిగా పని చేశాడు. సినిమాలపై ఉన్న మక్కువతో ఉద్యోగం వదిలేసి లఘ చిత్రాల నిర్మాణం వైపు అడుగులేశాడు. కేవలం 2వేల రూపాయలతో తొలి ప్రయత్నంలో 'ద్రోహం' అనే లఘు చిత్రాన్ని తీశాడు. దర్శకుడు పూరీ జగన్నాథ్ నిర్వహించిన లఘచిత్రాల పోటీకి పంపి మెప్పించాడు. అతని వద్ద 3 నెలలు పని చేసి... చిత్ర నిర్మాణంపై పట్టు సాధించాడు.
ద్రోహంతో మొదలుపెట్టి ఆరు లఘు చిత్రాలు తీశాడు. ఇటీవల పవన్‌రాజ్ 'రేపల్లె' అనే ఓ ఇండిపెండెంట్ చిత్రాన్ని తీశాడు. ఓ యువకుడు ఐటీ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపే కథాంశంతో సందేశాత్మక చిత్రం తీశాడు. లక్షన్నర వ్యయంతో పదిరోజుల్లో రేపల్లె చిత్రాన్ని చేశాడు పవన్‌రాజ్. గుంతకల్లు సినిమా థియేటర్లలో వారం రోజులు బెనిఫిట్ షోలు వేశాడు. వచ్చిన స్పందన చూసి రాష్ట్రమంతటా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు.
సందేశాత్మక లఘు చిత్రాలు నిర్మిస్తున్న పవన్‌కు మిత్రులు ఆర్థికంగా నిలబడ్డారు. దర్శకుడు కావాలనే పవన్ ఆశకు తల్లిదండ్రులూ భరోసాగా నిలిచారు. పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగిస్తున్న పవన్ రాజ్...వెండితెర అవకాశాల్ని అందిపుచ్చుకునే దిశగా సాగుతున్నాడు.