ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సోదరి షర్మిలకు అమరావతి మహిళా ఐకాస ప్రతినిధి సుంకర పద్మశ్రీ లేఖ రాశారు. ఇటీవల తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం చేసిన ధర్నా సందర్భంగా.. గాయపడటం విని మహిళా ఐకాస ప్రతినిధులంతా చాలా బాధపడ్డామని పేర్కొన్నారు. మీ పోరాటంలో ఎంత న్యాయం ఉందో, 491 రోజులుగా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ అప్రతిహతంగా చేస్తున్న తమ ఆందోళనలోనూ అంతే న్యాయం ఉందన్నారు.
ఒక్కసారి మాత్రమే పోలీసులు మిమ్మల్ని అవమానించి, గాయపరిచారని.. కానీ వందల రోజులుగా జగన్ ప్రభుత్వంలోని పోలీసులు ప్రతిరోజూ అవమానించి, గాయపరుస్తున్న విషయం మీకు తెలియనిది కాదని లేఖలో వివరించారు. మిమ్మల్ని ఆహ్వానించేందుకు అమరావతి మహిళా ఐకాస ప్రతినిధి బృందం మీ వద్దకు రావాలనుకుంటున్నామని.. అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ కొవిడ్ తీవ్రత కారణంగా రాలేకపోయినప్పటికీ, అమరావతి రైతుల పోరాటానికి మద్దతునిస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చినా ఉద్యమానికి మేలు చేసినవారవుతారని షర్మిలను కోరారు.
తెలంగాణలో మీ పోరాటానికి మీ వదిన భారతిరెడ్డి సారథ్యంలోని మీడియా ఏవిధంగా కవరేజీ ఇవ్వడం లేదో, ఇక్కడ మా అమరావతి మహిళా పోరాటానికీ ఆ మీడియా కవరేజీ ఇవ్వకపోగా, మాపై వ్యతిరేకంగా కథనాలు రాస్తోంది. ఈ విషయంలో మీరు, మేము ఇద్దరమూ ఆ మీడియా బాధితులమే. మీపై జరిగిన దాడికి తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చి సమాధానం ఇవ్వాలని మీ తల్లి విజయమ్మ డిమాండ్ చేశారు. అమరావతిలో తమపై ప్రతిరోజూ జరుగుతున్న దాడులకు మీ సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం దిగివచ్చి సమాధానం చెప్పడమే ధర్మం. ఈ విషయంలో జగన్‌కి ఓమాట చెబితే తెలంగాణలో మీ పోరాటానికి విశ్వసనీయత ఉంటుంది. అమరావతి కోసం తాము చేస్తున్న ఆందోళనకు మీ మద్దతు ఆశిస్తున్నాం.
- సుంకర పద్మశ్రీ, అమరావతి మహిళా ఐకాస ప్రతినిధి
ఇదీ చదవండీ: మినీ పురపోరులో ప్రచార సమయం కుదింపు