Amaravathi JAC action plan : ఇప్పటినుంచి చేసే అమరావతి ఉద్యమం ఎంతో కీలకమని అమరావతి ఐకాస ప్రతినిధులు స్పష్టం చేశారు. రాజధానిని ఇప్పటికే మూడు ముక్కలు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు అమరావతి ప్రాంతాన్ని కూడా మూడు ముక్కలు చేస్తానంటున్నారని ఆరోపించారు. ఇకనైనా మూడు ముక్కలాట మానుకుంటే మంచిదని హితవు పలికారు. నిర్మాణం పూర్తై సిద్ధంగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా కొత్త రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారని నేతలు మండిపడ్డారు. అమరావతి ఉద్యమంలో వివిధ ఘట్టాలు వివరిస్తూ విజయవాడలో మహా పాదయాత్ర నూతన సంవత్సర క్యాలెండర్‌ను అమరావతి ఐకాస, రైతు ఐకాసల ఆధ్వర్యంలో విడుదల చేశారు.
రాక్షసుల నుంచి అమరావతి భూముల్ని కాపాడుకోవాలని ఐకాస నేతలు కోరారు. మంచి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఇంటిలో అమరావతి ఉద్యమం గురించి తెలియాలంటే ఈ క్యాలెండర్ ఉపయోగపడుతుందన్నారు. అందుకే ఎంతో ఆలోచించి ఈ క్యాలెండర్ తెచ్చినట్లు తెలిపారు. ప్రాణాలకు తెగించైనా అమరావతిని కాపాడుకుంటామని అమరావతి ఐకాస ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, పరిరక్షణ సమితి నాయకులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కేంద్రం ఎరువుల ధరల పెంపు నిర్ణయంపై.. సీఎం కేసీఆర్ నిరసన