ఏపీ రాజధాని అమరావతి విషయంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్ వ్యాఖ్యలు తమను గందరగోళంలోకి నెట్టాయని అమరావతి రైతులు అన్నారు. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. అమరావతి రాజధానిగా కొనసాగాలని తాము చేస్తున్న ఉద్యమానికి భాజపా సంపూర్ణ మద్దతు ఇస్తుందని విశ్వసిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర నాయకత్వం పోరాటంలో భాగంగా ఉందని వివరించారు. అయితే పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్, రాష్ట్ర ఇంఛార్జ్ దియోధర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తమ నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయని చెప్పారు.
ప్రధానిపై నమ్మకంతోనే భూములిచ్చాం
అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారనే.. తాము వేల ఎకరాల భూములు త్యాగం చేశామని రైతులు లేఖలో తెలిపారు. 2017లో కాపిటల్ గెయిన్స్ నుంచి రైతులకు మినహాయింపు ఇచ్చారని.. రాజధాని నిర్మాణం కోసం రూ.1,500 కోట్ల నిధులు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం రాజధాని తరలించాలనే కుట్ర పన్నుతోందన్నారు.
జాప్యం జరిగేకొద్దీ వినాశనమే
భాజపా జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా అమరావతి అంశంపై దృష్టి సారించాలని అన్నదాతలు కోరారు. కేంద్రప్రభుత్వం విస్పష్టమైన విధాన నిర్ణయం తీసుకుని రాజధానిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. జాప్యం జరిగేకొద్దీ వినాశనం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అమరావతి కోసం చాలామంది రైతులు మరణించారని లేఖలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్‌ను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని విన్నవించారు.
ఇవీ చదవండి...