కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి విమర్శించారు. తక్షణమే ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కొవిడ్ పరీక్షలు, చికిత్స అందించడంలో కావాల్సిన సదుపాయాలు, వనరులు, వైద్య సిబ్బందిని సమకూర్చుకోవడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కరోనా నియంత్రణలో దేశంలోనే చివరి స్థానంలో రాష్ట్రం ఉందని ఆరోపించారు.
కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న వైద్య సిబ్బందిని కూడా ప్రభుత్వం కాపాడుకోలేకపోతోందని మండిపడ్డారు. వైద్యులకు ప్రైవేట్ హోటళ్లలో వసతి కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం ఫలితంగా కొవిడ్ నిర్ధరణ పరీక్షలు, చికిత్సల పేరిట ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని... ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా చికిత్సలను ఆరోగ్య శ్రీలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. అవసరమైన వైద్య సిబ్బందిని భర్తీ చేసుకొని.. కొవిడ్ పరీక్షల సంఖ్యను పెంచాలని.. ప్రభుత్వమే ఉచితంగా చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: ఆ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని ప్రధానికి కేసీఆర్ లేఖ