బాధ్యత గల ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ స్పష్టం చేశారు. కొవిడ్ కేసుల్లో వాస్తవాలను వెల్లడించడం లేదని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ అబద్దాలు ఆడుతూ... పైశాచిక ఆనందం పొందుతోందని మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్‌లు విమర్శలు చేయడంపై తీవ్రంగా స్పందించారు. మంత్రులు బాధ్యతలను విస్మరించి అబద్దాలు ఆడుతూ ప్రజలను అవమాన పరుస్తున్నారని ఆరోపించారు.
కరోనాతో జనం పిట్టల్లా రాలుతుంటే... మొక్కలు నాటుతూ, సచివాలయం కూలగొడుతూ ప్రజల బాగోగులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్నటి కరోనా బాధితులు, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆ వివరాలు వెల్లడిస్తే... ఎవరు అబద్దాలు ఆడుతున్నారో తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన వివరాలు అబద్దాలు అని తేల్చకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. అందుకు సిద్ధమా అని మంత్రులను సంపత్‌కుమార్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి : ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్