2020 వానాకాలానికి సంబంధించి రైతుబంధు పథకం కింద రూ.7183.63 కోట్లు పెట్టుబడి సాయం పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దనరెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.56,94,185 సొమ్ము జమచేసినట్లు తెలిపారు.
ఈనెల 5 వరకు సమయం..
ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు ఇవ్వని రైతులు ఏఈఓలను కలవాలని సూచించారు. ఈనెల 5 లోగా ఏఈఓల వద్ద బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ వద్ద 34,860 మంది రైతుల ఖాతాల వివరాలు సరిగా లేవన్న జనార్దనరెడ్డి.. వారికి మాత్రమే సొమ్ము చేరలేదని స్పష్టం చేశారు. ఆయా ఖాతాల్లో డబ్బు వేసినా.. జమకాలేదన్నారు. ఐఎఫ్ఎస్సీ కోడ్ లేక, ఖాతాలు మూసేయడం వల్ల నగదు జమకాలేదని జనార్దన్‌రెడ్డి వివరించారు.
పేర్లలో వ్యత్యాసాలు గుర్తించాం..
3,400 మంది రైతులకు బ్యాంకు పాసు పుస్తకాల్లో తేడాలు ఉన్నాయన్నారు. ఆధార్, పట్టాదారు పుస్తకాల్లోని ఖాతాదారుల పేర్లలో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. www.agri.telangana.gov.in నుంచి ఏఈఓను ఫోన్ నంబరు పొందవచ్చని సూచించారు. అర్హత ఉన్నా నిధులు జమ కానట్లైతే ఏఈఓ, ఏఓ, ఏడీ, డీఏఓలను సంప్రదించాలని జనార్దనరెడ్డి కోరారు. వ్యవసాయ శాఖ గ్రీవెన్స్ నంబరు- 7288876545, వ్యవసాయశాఖ మెయిల్ - dda-rbgc-agri.telangana.gov.in ను సంప్రదించాలని సూచించారు.