హలో మేము ఏసీబీ నుంచి మాట్లాడుతున్నాం.. మీరు లంచం తీసుకుంటునట్లు మాకు ఫిర్యాదు వచ్చింది. కొంచెం ఖర్చు పెడితే చాలు మీకు క్లీన్ చిట్ వస్తుంది అంటూ అధికారులకు ఫోన్ చేసి నగదు వసూలు చేస్తున్న ముఠాను తాజాగా ఏపీలోని కర్నూలు పోలీసులు పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారిస్తే దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
జైల్లోనే స్కెచ్.. తోటి ఖైదీలే సభ్యులు
జయకృష్ణ, శ్రీనాథ్ రెడ్డి అనే ఇద్దరు నిందితులు డిగ్రీ వరకు చదువుకున్నారు. డబ్బు కోసం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు పక్కా పథకం వేశారు. ఓ సినిమా కథ ఆధారంగా నకిలీ ఏసీబీ అధికారుల అవతారమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని శాఖల అధికారులను లక్ష్యంగా చేసుకుని ఫోన్ చేసేవారు. ఇలా లక్షల రూపాయలు దోచేశారు. ఈఏడాది ఫిబ్రవరిలో అనంతపురం పోలీసులు వీరిని అరెస్ట్‌చేశారు. ఆ తర్వాత జైల్లో మరికొందరు ఖైదీలతో కలిసి జయకృష్ణ మరోసారి అనిశా అధికారి అవతారమెత్తాడు. ఎవరికి అనుమానం రాకుండా కర్ణాటకు చెందిన మూడు సిమ్ కార్డులు తీసుకున్నాడు. కర్ణాటకలోనే బ్యాంక్ ఖాతాలు తెరిచారు. అధికారుల గురించి ముందుగా తెలుసుకుని వారికి ఫోన్‌లు చేసేవారు. కొంత ఖర్చు చేస్తే... ఫైల్ మూసేస్తామంటూ బేరసారాలు జరిపేవారు. భయపడిన వారంతా వీరికి రూ.25 వేల నుంచి రూ.5లక్షల వరకూ ముట్టజెప్పారు.
అయితే నకిలీ ఏసీబీ ఫోన్‌కాల్‌పై కర్నూలు జిల్లాకు చెందిన ఓ అధికారి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వీరి గుట్టురట్టైంది. గ్యాంగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మొత్తం సమాచారాన్ని రాబట్టారు. నకిలీ ఫోన్ కాల్ ద్వారా బెదిరించి ప్రభుత్వ అధికారుల నుంచి రూ.28లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు.
ఏకకాలంలో అనిశా దాడులు...
నకిలీల ఖాతాలకు నగదు పంపిన వారి వివరాల ఆధారంగా..9 జిల్లాల్లోని 13మంది అధికారుల కార్యాలయాలపై అనిశా అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఆర్ అండ్ బీ కార్యాలయంలో డీఈ జాన్ విక్లిఫ్ రూ.లక్షా 30 వేలు నకిలీ ఏసీబీకి ఇచ్చినట్లు గుర్తించారు. శ్రీకాకుళం పంచాయతీ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కేడీఆర్ గుప్తా రూ.50వేలు నిందితుల ఖాతాలో జమచేసినట్లు అనిశా అధికారులు తెలిపారు. విశాఖలో శివశంకర్ రెడ్డి అనే అధికారి జాయింట్ చీఫ్ ఇనస్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్‌గా పనిచేస్తున్నారు. ఈయన నిందితుల అకౌంట్‌కు రూ.5 లక్షల 0బదిలీ చేసినట్లు గుర్తించారు. ఏలూరు ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో రావుపాటి ప్రభాకరరావు రూ.లక్షా 97వేలు.. కృష్ణా జిల్లా గుడివాడలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వేంకటేశ్వరరావు రూ.3 లక్షల 15వేలు నకిలీలకు ఇచ్చారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూర్ ఆర్డీవో ఉమాదేవి రూ.25 వేలు, నెల్లూరు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారి వెంకట దుర్గాప్రసాద్ రూ.30 వేలు, నెల్లూరు ఇండస్ట్రీయల్ చీఫ్ ఇన్స్ పెక్టర్ పరమేశ్వరరావు రూ.2 లక్షలు ఇచ్చారు. చిత్తూరు ఆర్అండ్బీ ఈఈ చంద్రశేఖర్ రూ.లక్షా 90వేలు, చిత్తూరు ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణమూర్తి రూ.లక్షా 50వేలు, పలమనేరు మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి రూ.మూడున్నర లక్షలు నకిలీలకు ఇచ్చినట్లు గుర్తించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్వీఐగా పనిచేస్తున్న రామచంద్రరావు నిందితుల అకౌంట్లో రూ.4 లక్షల 94వేలు జమ చేసినట్లు గుర్తించారు.
అనిశా నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఫోన్ కాల్ వస్తే తమకు సమాచారమివ్వాలని.. అవినీతి నిరోధక శాఖ అధికారులు కోరారు. నకిలీలకు డబ్బులిచ్చిన అధికారులు... ఇప్పుడు అసలైన అనిశా అధికారుల చేతికి చిక్కడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటివారినైనా విడిచిపెట్టొదు: సీఎం