ఈఎస్ఐ ఔషధాల కుంభకోణంలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో అరెస్ట్ అయిన వెంకటేశ్వర హెల్త్‌కేర్ ఎండీ అరవింద్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అనిశా అధికారులు ఇవాళ మరో ముగ్గురిని అరెస్టు చేశారు. తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్ రెడ్డి, చర్లపల్లి డిస్పెన్సరీ ఫార్మసిస్ట్ లావణ్యతో పాటు వరంగల్ జేడీ కార్యాలయంలో పొరుగుసేవల ఉద్యోగి పాషాను అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐ సంచాలకులు దేవికారాణితో కలిసి ఔషధాల కొనుగోలులో వీళ్లు ముగ్గురు అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అవసరం లేకున్నా ఔషధాలు ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం, డిస్పెన్సరీలకు వెళ్లాల్సిన మందులను ప్రైవేట్ ఫార్మ కంపెనీలకు మళ్లించి... బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు అనిశా అధికారులు తేల్చారు.
దేవికారాణితో పాటు మరో ఆరుగురిని రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించిన అనిశా అధికారులు వారి నుంచి కొంత సమాచారం సేకరించారు. జైళ్లో ఉన్న మరో ఆరుగురిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. వాళ్లను కూడా కస్టడీలోకి తీసుకోని కుంభకోణానికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తులో వెల్లడవుతున్న అంశాల ఆధారంగా మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 16కు చేరింది.
ఇవీ చూడండి:రేపు అన్ని డిపోల వద్ద మౌనపోరాటం