పొట్ట కూటి కోసం ఉన్న ఇళ్లు, పొలాలు అమ్మి కొందరు, అప్పులు చేసి మరికొందరు మస్కట్ దేశానికి వెళ్లారు. మస్కట్‌లోని అల్ తుర్కీ కంపెనీలో కొన్నాళ్లు పని చేసుకుంటూ ఇంటికి డబ్బులు పంపించారు. ఇలాగే ఇంకొన్నాళ్లు పనిచేసుకొని ఇంటికి వెళ్లిపోవాలనుకున్నారు. కానీ వారి ఆశని కరోనా మహమ్మారి చిదిమేసింది. ఇన్నాళ్లు పని కల్పించి 10 వేల మందికి పైగా... అన్నం పెట్టిన కంపెనీయే వారి పాలిట రాక్షసమూకలా మారింది.
కష్టాల్లో కూలీలు
కరోనా కారణంగా పనులు మాన్పించిన అల్ తుర్కీ కంపెనీ యాజమాన్యం కూలీల పాస్‌పోర్టులు లాగేసుకుంది. మూడు నెలలుగా సరిగ్గా అన్నం కూడా పెట్టట్లేదు. పని లేక, తినేందుకు బుక్కెడు తిండిలేక కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తూ... ధర్నాకి దిగిన కూలీలను ఇంటికి పంపిస్తామంటూ బస్సుల్లో వేరే చోటుకి తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్లిన వారిని ఇష్టమొచ్చినట్లుగా కొడ్తూ... వారితో పనులు చేయించుకుంటున్నారు.
పని చేస్తారా.. చస్తారా..!
విషయం తెలుసుకున్న తోటి కూలీలు మళ్లీ ఆందోళనకి దిగారు. కోపంతో ఊగిపోయిన కంపెనీ యాజమాన్యం జీతాల్లేవు.. ఏంలేవు పని చేయడంటూ హుకూం జారీ చేసింది. వెనక్కి తగ్గని కూలీలపై దాడికి దిగింది. ఈ దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కనీసం అతనికి చికిత్స కూడా చేయించట్లేదు అల్ తుర్కీ కంపెనీ యాజమాన్యం. ఇది చాలదన్నట్లు రేపటి నుంచి పనులు చేయకపోతే... మీ పరిస్థతి కూడా ఇదేనంటూ వారిని బెదిరిస్తున్నారు.
కాళ్లు మొక్కుతాం.. కాపాడండయ్యా..!
ఎలాగైనా సరే తమను ఇంటికి చేర్చాలని ఆ కూలీలు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశంకాని దేశంలో తామ వారు పడుతున్న కష్టాల గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారిని స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చదవండి: హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు