కన్యాకుమారి నుంచి కశ్మీర్‌లోని లేహ్ వరకూ సైకిల్‌పై ప్రయాణించి గిన్నిస్ రికార్డు అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఏలేరు గ్రామానికి చెందిన రొంగల జ్యోతి అనే యువతి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకూ 26 రాష్ట్రాల మీదుగా 18,200 కిలోమీటర్లు సైకిల్ యాత్ర నిర్వహించానని ఆమె వెల్లడించారు. కరోనా నేపథ్యంలో విరామం ప్రకటించానని.. మరో వారం రోజుల్లో యాత్ర కొనసాగిస్తానని జ్యోతి చెప్పారు. కాకినాడలోని గోదావరి సైక్లింగ్ క్లబ్ సభ్యులతో కలిసి 100 కిలోమీటర్ల సైకిల్ రైడ్‌లో ఆమె ఆదివారం పాల్గొన్నారు.
మహిళల భద్రత సందేశంతో యాత్ర
భారతదేశంలో రోడ్ల మీద మహిళల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న సందేశాన్ని ఇవ్వడానికి తాను యాత్ర చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. కాకినాడలోని గోదావరి సైక్లింగ్ క్లబ్ సభ్యులు.. జ్యోతి సాగిస్తున్న సైకిల్ యాత్రకు మద్దతు తెలిపారు. ఎంబీఏ వరకూ చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న జ్యోతి మహిళల భద్రత సందేశంతో సైకిల్ యాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆమె మరో 800 కిలోమీటర్లు ప్రయాణిస్తే 19వేల కిలోమీటర్ల సైకిల్ రైడ్‌తో ఆస్ట్రేలియా పేరుతో ఉన్న గిన్నిస్ రికార్డును అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆర్ధిక వనరులు లేకపోయినా ధైర్యంతో యాత్ర సాగిస్తుండటం స్ఫూర్తిదాయకమని అభినందించారు.
ఇవీ చూడండి: 3 నిమిషాల్లో 53 భంగిమలు- చిన్నారి ప్రపంచ రికార్డు