తీవ్రవాదుల పేరుతో స్నేహితుడిని బెదిరించి 30 లక్షలు డిమాండ్ చేసిన సత్యశ్రీనివాస్ ప్రసాద్ రావు అనే వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి లలితా జ్యువెల్లర్స్ స్టోర్లో అసిస్టెంట్ మేనేజరుగా పని చేస్తున్న సత్యశ్రీనివాస్ ప్రసాద్ రావు, కేపీహెచ్బీ కాలనీకి చెందిన రామ్గోపాల్ రెడ్డి ఇద్దరూ స్నేహితులు. కొద్ది రోజుల క్రితం సత్య శ్రీనివాస్ తిరుపతిలోని లలిత జ్యువెలరీ శాఖకు బదిలీపై వెళ్ళాడు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈక్రమంలో సత్య శ్రీనివాస్, స్నేహితుడిని బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు పన్నాగం పన్నాడు. దాని ప్రకారం రామ్గోపాల్ రెడ్డికి ఓ తీవ్రవాద గ్రూప్ పేరుతో బెదిరింపు లేఖ పంపి 30 లక్షలు రూపాయలు డిమాండ్ చేశాడు. మళ్లీ గత నెల 20వ తేదీన డబ్బులను సికింద్రాబాద్ స్టేషన్లోని ప్లాట్ ఫారంపై ఆగి ఉన్న చార్మినార్ ఎక్స్ప్రెస్లో డబ్బులు పెట్టాలని గుర్తుతెలియని నంబర్ నుంచి సందేశం పంపించాడు.
డబ్బులు ఇవ్వని సందర్భంలో రాంగోపాల్ రెడ్డి 12 సంవత్సరాల కూతురిని ముక్కలుగా నరికి చంపుతానని హెచ్చరించాడు. దాంతో రాంగోపాల్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ సందేశం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ముందు ఆ నంబర్ ఉపయోగిస్తున్న శివ అనే వ్యక్తిని విచారించగా, 20వ తేదీన ఎంజీబీఎస్ బస్టాండులో ఓ వ్యక్తి తన ఫోన్ అడిగి తీసుకొని ఉపయోగించి, తిరిగి ఇచ్చివేశాడని తెలిపారు. పోలీసులు బస్టాండ్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియో రాంగోపాల్ రెడ్డికి చూపించగా ఆ దృశ్యంలో ఉన్నది తన స్నేహితుడు సత్యశ్రీనివాస్ ప్రసాద్ రావుగా గుర్తించాడు. పోలీసులు నిందితుని కోసం గాలించి ఈ నెల 10వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకి తరలించారు.
ఇవీ చూడండి: "ఈఎస్ఐ" కుమ్మక్కయ్యారు... కోట్లు మింగారు..!