చదివేది తొమ్మిదో తరగతే.. కానీ సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. వాహనాల వలన వచ్చే కాలుష్యాన్ని గమినించాడు. వాటితో కలిగే ఇబ్బందులను తెలుసుకున్నాడు. బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొదించాడు.
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన షాంషావలి, షమిమ్ సుల్తానా దంపతుల కుమారుడు సమీర్. తల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్ వైజర్, తండ్రి ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తున్నారు. సమీర్ స్థానికంగా తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రహదారి పక్కనే వారి నివాసం ఉండడం... నిత్యం వందలాది వాహనాలు ఇంటిముందు వెళ్లడం చూశాడు. వాటి నుంచి వచ్చే కాలుష్యాన్ని గమనించాడు. ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు.
కాలుష్య రహిత వాహనం రూపొందించాలని సమీర్ అనుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో వెతుకులాట ప్రారంభించాడు. తనకు కావలసిన వస్తువులను తెచ్చుకున్నాడు. రెండు నెలలు కష్టపడి బ్యాటరీతో నడిచే వాహనాన్ని తయారు చేయగలిగాడు.
ఉపయోగించిన పరికరాలు
బ్యాటరీ సైకిల్ తయారుచేయడానికి.. ముందువైపు ఒక లైటు, మధ్య భాగంలో ఇండికేటర్ అమర్చాడు. రెండు బ్యాటరీలు వెనక చక్రానికి.. అదనంగా చక్రం, మోటర్ అమర్చాడు. మూడు గంటలు ఛార్జింగ్ చేస్తే 60 నుంచి 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని తయారీకి 9 వేల రూపాయల వరకు ఖర్చు అయినట్లు సమీర్ తెలిపాడు. మరో రెండు వేల రూపాయలు వెచ్చిస్తే.. వాహనం పూర్తిగా కొత్తగా కనిపిస్తుందని వెల్లడించారు.