ప్రభుత్వం ఇటీవల కొవిడ్-19 పరీక్ష కేంద్రాలను పెంచిన నేపథ్యంలో కేసుల సంఖ్యపెరుగుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ మహమ్మారి విస్తృతి ఉద్ధృతంగా ఉంది. ఛాతీ ఆసుపత్రికి చెందిన ఓ సీనియర్ హెడ్ నర్సు కరోనాతో మృతి చెందడం వైద్యవర్గాల్లో విషాదాన్ని నింపింది. కేరళ తరహాలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు.
ఇక దోమలగూడలోని ఓ కుటుంబంలో 9 మందికి, తుర్కయాంజల్‌లో 13 మందికి కరోనా నిర్ధారణ అయింది. యూసఫ్‌గూడలోని మొదటి పటాలంలో ఇప్పటి వరకు 23 మందికి వైరస్ సోకడంతో అప్రమత్తమయ్యారు. కుత్బుల్లాపూర్‌లో మరో 25 మంది వైరస్ బారిన పడ్డారు.
ట్రాఫిక్ కంట్రోల్ రూంలో కలకలం
బషీర్‌బాగ్‌లోని ట్రాఫిక్ కంట్రోల్ రూంలో అదనపు సీపీ(ట్రాఫిక్) పేషీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సిబ్బందికి ఇప్పటికే కరోనా నిర్ధారణ కాగా.. శుక్రవారం ఓ హోంగార్డుకు పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు మూడో అంతస్తులో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేయించారు. మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలోనూ ముగ్గురికి కరోనా సోకడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న వారందరికీ పరీక్షలు చేయించారు. రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం 86, మేడ్చల్ జిల్లాలో 53 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.