Telemedicine in Hyderabad: కంప్యూటర్ తెరపై నుంచి అవతల వైపు ఉన్న వైద్యుని చూస్తూ తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. బస్తీ దవాఖానాలో ఉన్న వైద్యులు ఆ మేరకు రోగికి అవతల వైద్యుని మధ్య అనుసంధాన కర్తగా ఉంటారు. 80 శాతం రోగాలు టెలీమెడిసిన్ ద్వారానే నయం అవుతున్నాయి. అత్యవసర చికిత్సలకు మాత్రం పెద్దాసుపత్రులకు వెళ్తే సరిపోతుంది. తొలుత ప్రయోగాత్మక పరిశీలన కింద ప్రవేశపెట్టిన ఈ సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో నలువైపులా విస్తరింపజేస్తున్నారు. కొవిడ్ సమయంలో మరింతగా టెలీ మెడిసిన్‌కు మంచి డిమాండ్ పెరిగింది. నేరుగా ఆసుపత్రులకు వెళ్తే... ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఉండటంతో ఉన్న చోట నుంచే వైద్య సేవలు పొందేందుకు ప్రజలు వీటిని విరివిరిగా ఉపయోగిస్తున్నారు.
బస్తీ దవాఖానాల్లోనే నమూనాలు సేకరణ: ఉస్మానియా ఆసుపత్రి ఆధ్వర్యంలో గత ఏడాది కాలంగా 10 వేల 173 మంది రోగులకు టెలీమెడిసిన్ ద్వారా సేవలు అందించారు. మొత్తం 94 మంది వైద్య నిపుణులు ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి ద్వారా నిత్యం 70 నుంచి 80 మంది రోగులు టెలీ మెడిసన్ ద్వారా చికిత్సలు పొందుతున్నారు. ముఖ్యంగా చర్మ వ్యాధులు, జనరల్ మెడిసిన్, ఎముకలు, కీళ్లు, మధుమేహం, థైరాయిడ్, అధిక రక్తపోటు, మూత్రపిండాలు, జీర్ణకోశ సమస్యలు తదితర వాటికి సూచనలు, సలహాలతోపాటు చికిత్సలు కూడా టెలీమెడిసిన్ ద్వారా రోగులకు అందుతున్నాయి. ఏవైనా పరీక్షలు అవసరమైతే అక్కడ నుంచే సూచిస్తున్నారు. బస్తీ దవాఖానాల్లోనే నమూనాలు సేకరించి... వాటిని పరీక్షలకు పంపుతున్నారు. గాంధీలోనూ ఈ తరహా సేవలకు మంచి స్పందన వస్తోంది. బస్తీ దవాఖానాల్లో విజయవంతం కావడంతో.. ఇటీవల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులకు కూడా టెలీమెడిసిన్ సేవలను అనుసంధానం చేశారు.
ప్రతి చిన్న వ్యాధికి ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు రావాల్సిన అవసరం లేదని... ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. బస్తీ దవాఖానాల్లో వైద్యులను సంప్రదిస్తే.. అక్కడ నుంచే నేరుగా ఉస్మానియా, గాంధీ వైద్యులను సంప్రదించవచ్చునని చెప్పారు. దీంతో ఆసుపత్రులపై భారం, పని ఒత్తిడి తగ్గుతుందన్నారు.