రాష్ట్రంలో మిగిలిన వలస కూలీలను సొంత ప్రాంతాలకు చేరవేసేందుకు ప్రభుత్వం, రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేశాయి. హైకోర్టు ఆదేశాలతో.. కూలీలను ఇవాళ శ్రామిక్ రైళ్లలో తరలించనున్నారు. ఇటుక బట్టిల్లో పని చేస్తున్న కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారంటూ... దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.
మరో 16 వేల మంది..
మిగిలిన కూలీలను తరలించేందుకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించగా... ఇప్పటి వరకు సుమారు 49 వేల మంది స్వస్థలాలకు చేరుకున్నారని కార్మిక శాఖ తెలిపింది. మరో 16 వేల మంది వెళ్లటానికి సిద్ధంగా ఉన్నారని నివేదించింది. వారిని సైతం తరలించాలని ధర్మాసనం పేర్కొనగా.. ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేసింది. ఒడిశా, శ్రీకాకుళానికి చెందిన వారిని ఐదు శ్రామిక్ రైళ్లలో తరలిస్తోంది. మరో నాలుగు రైళ్లు ఏర్పాటు చేసి మిగిలిన వారిని చేరవేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
హైకోర్టు అసంతృప్తి..
వలసకూలీల సంక్షేమానికి సంబంధించి అధికారుల తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బిహార్, ఝార్ఖండ్, రాజస్థాన్‌కు వెళ్లాల్సిన వారి కోసం శ్రామిక్ రైళ్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఒడిశా, ఏపీ, ఛత్తీస్ గడ్, కర్ణాటక రాష్ట్రాల వారి కోసం బస్సులు నడిపి.. సరిహద్దులకు చేర్చాలని గతంలో ఆదేశించింది.
కోర్టు ఆగ్రహం..
ఈ ఆదేశాలు ఎంతవరకు అమలయ్యాయో నివేదికలో ప్రస్తావించకపోవటంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక రైళ్లలో కార్మికుల కోసం నాలుగు బోగీలు ఏర్పాటు చేయకపోవటాన్ని తప్పుబట్టింది. దీని వల్ల కూలీలు వారికి నచ్చిన రోజు వెళ్తారని హైకోర్టు పేర్కొంది. స్వస్థలాలకు వెళ్లే కార్మికులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది
ఇవీ చూడండి: 7.5 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం.. ఐదుగురి అరెస్ట్