jagananna colonies: పట్టణాల్లో కొత్తగా వేసే ప్రైవేటు లేఅవుట్లలో 5 శాతం స్థలాన్ని ఇకపై వైఎస్‌ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అది సాధ్యం కాదనుకుంటే ప్రాథమిక విలువపై స్థలానికి డబ్బైనా చెల్లించాలని నిర్ణయిస్తూ సంబంధిత జీవోను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఈ మేరకు 2017 లేఅవుట్, సబ్-డివిజన్ నిబంధనలను సవరించింది.
ఇది అదనం
ప్రస్తుతం ప్రతి లేఅవుట్‌లో 10% స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వ్యాపారులు కేటాయిస్తున్న దానికి ఇది అదనం. ఈ స్థలాన్ని పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్‌ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టు కోసం వినియోగించనున్నట్లు పురపాలకశాఖ పేర్కొంది. పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంఘాల పరిధిలో స్థిరాస్తి వ్యాపారులు వేసే లేఅవుట్లకు కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
మూడు 3 కిలోమీటర్లలోపు ఇవ్వొచ్చు
- లేఅవుట్‌లో 5 శాతం స్థలాన్ని కేటాయించడం సాధ్యం కాదనుకుంటే అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోపు అంతే విస్తీర్ణంలో స్థలాన్ని ఇవ్వొచ్చని పురపాలకశాఖ సూచించింది.
- స్థలం ఇవ్వదలచుకోకుంటే లేఅవుట్‌లో ప్రాథమిక విలువపై (బేసిక్ వాల్యు) 5 శాతం స్థలానికి డబ్బు చెల్లించొచ్చు. స్థలం లేదా డబ్బును జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని పురపాలకశాఖ పేర్కొంది.
ఈ నిర్ణయం అనైతికం..
'రాష్ట్రంలో ఉన్న ప్రతి లేఅవుట్‌లో 5 శాతం స్థలం అడగడం అనైతికం. పరిశ్రమలు తీసుకొచ్చి.. ఆర్థిక కార్యకలాపాలు పెంచి వచ్చే ఆదాయాన్ని పేదలకు ఇవ్వాలి. ప్రజల ఆదాయం గండికొట్టి వచ్చే ఆదాయాన్ని పంచడం కాదు' - తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి
ఇలాంటి నిర్ణయాలతో ఎవరికి మేలు..
ప్రైవేటు లేఅవుట్లలో జగనన్న కాలనీలకు 5 శాతం స్థలం ఇవ్వాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలతో ఎవరికి మేలని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: