కడలి కల్లోలానికి కకావికలమైన గ్రామాలు... శవాల దిబ్బగా మారిన ఊళ్లు.. తుడిచిపెట్టుకుపోయిన పంట పొలాలు..ఇప్పటికీ వారి కళ్లముందే మెదులుతున్నాయి. దివిసీమను ఉప్పెన ముంచెత్తి 42 ఏళ్లు అయినా...ఆ భయానక దృశ్యాలు అక్కడి వారిని కలవరపరుస్తూనే ఉన్నాయి. ఉగ్రరూపం దాల్చిన సముద్రుడు, ఉవ్వెత్తున ఎగిసి పడిన రాకాసి అలలు, 200 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన భయంకర గాలులతో ఆంధ్రప్రదేశ్ లోని దివిసీమ గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. నిద్రలోని వారు శాశ్వత నిద్రలోకి వెళ్లేలా చేశాయి. 83 గ్రామాల్లోని దాదాపు 8 వేల 500 మంది ప్రాణాలను గాల్లో కలిపేశాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి.
అప్పటి లెక్కల ప్రకారం రూ. 172 కోట్ల మేర విలువైన ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు 2.5 లక్షల పైనే మత్స్యకారుల వలలు, పడవలు గల్లంతయ్యాయి. ఎన్నో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కృష్ణా జిల్లాలోని కోడూరు, నాగాయలంక మండలాల్లోని గ్రామాల్లో ఉప్పెన అపార నష్టాన్ని మిగిల్చింది. లక్షలాది పశు పక్ష్యాదులు, వేల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఆనాటి ప్రళయం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ...ఇంకా అక్కడి వారి కళ్లెదుటే కదలాడుతున్నాయి.
"ఆ రోజును తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తోంది. నా పిల్లలు చెల్లాచెదురయ్యారు. వరదలో ఈదుకుంటూ ఎలాగోలా ఓ ఇంటి పైకి చేరుకున్నాను. మర్నాడు ఉదయం ఎక్కడా చూసిన నీరే. చాలా మంది వరదలో కొట్టుకుపోయారు. మాఉర్లో మెుత్తం 161 మంది జల సమాధి అయ్యారు. గర్భిణిగా ఉన్న నా భార్య వరదలో కొట్టుకుపోయి ఓ చెట్టులో చిక్కుకుంది. ఇప్పటికీ ఆదృశ్యాలను తలచుకుంటే వణుకుపుడుతుంది."
-వెంకటేశ్వరావు, బాధితుడు
నవంబర్ వచ్చిందంటే చాలు దివిసీమ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం , తుపాను మాట వింటే వారు గజగజా వణికిపోతారు. గుండెలను అరచేతిలో పెట్టుకొని ...కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. ప్రళయం వచ్చి 42 ఏళ్లు దాటినా...దివిసీమ గ్రామాలు ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. సరైన కరకట్టలు, తుపాను షెల్టర్లు లేక... భయం భయంగా బతుకీడుస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కరకట్టలు, తుపాను షెల్టర్లు నిర్మించాలని స్థానిక ప్రజలు వేడుకొంటున్నారు.
ఇదీ చూడండి : పాకిస్థాన్ చెరలో తెలుగు వ్యక్తి