రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. మరో 2,123 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 1,69,169కి చేరింది. వైరస్‌తో మరో 9 మంది బలవ్వగా... మొత్తం మరణాల సంఖ్య 1,025కు చేరింది. కరోనా నుంచి 2,151 కోలుకున్నారు. ఇప్పటివరకు 1,37,508 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 30,636 యాక్టివ్ కేసులుండగా... 24,070 మంది హోం ఐసోలేషన్, ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 305 మందికి కరోనా సోకింది. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి 185, మేడ్చల్ మాల్కాజిగిరి 149, నల్గొండ 135, కరీంనగర్ 112, మిగతా జిల్లాలో రెండు అంకెల్లో కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యాధి విస్తృతి ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ నిబంధనలు ప్రజలు పాటించకపోవడం వల్లే వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. జాతీయ రికవరీ రేటు 79.26 శాతం ఉండగా... రాష్ట్రంలో 81.28 గా నమోదైంది. మరణాల రేటు రాష్ట్రంలో 0.60శాతం ఉండగా... దేశంలో 1.61గా ఉంది.