ప్రస్తుత లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల్లో అత్యధికులు వ్యవసాయదారులే ఉన్నారు. కొత్త లోక్‌సభ ఏర్పడిన ప్రతిసారీ సభ్యుల వృత్తులను వర్గీకరించడం ఆనవాయితీగా వస్తోంది. మొత్తం సభ్యులు 116 వృత్తుల్లో ఉన్నారు. కొందరు రెండు మూడు వృత్తుల జాబితాలలో కనిపించారు. వ్యవసాయం వృత్తిగా 189 మంది, సామాజిక సేవ (202), వ్యాపారం (95), న్యాయవాదులు (43), రైతులు (35), విద్యావేత్తలు (27), వైద్యులు (26), పారిశ్రామికవేత్తలు (24), రచయితలు (17), ఇంజినీర్లు (14), రాజకీయాలు (12), బిల్డర్లు (10) ఉన్నారు. ఇంకా సివిల్ సర్వెంట్లు 9 మంది, సినీనటులు 8, కళాకారులు, పాత్రికేయులు ఏడుగురు చొప్పున ఉన్నారు.
తెలంగాణ సభ్యులు ఇలా..:
రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 17 మందిలో ఆదిలాబాద్, చేవెళ్ల, మహబూబాబాద్, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి ఎంపీలు తమ వృత్తి నేపథ్యమేంటో పేర్కొనలేదు. మిగిలిన 11 మందిలో ఆరుగురు తమకు వ్యవసాయంతో సంబంధం ఉన్నట్లు చెప్పారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజకీయ సంస్కర్త (పొలిటికల్ రిఫార్మర్) అని తెలిపారు. పారిశ్రామికవేత్తల జాబితాలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఒక్కరే ఉన్నారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్‌లు వ్యాపారం, వ్యవసాయాలను వృత్తిగా పేర్కొనగా, వరంగల్ ఎంపీ దయాకర్ వ్యాపారంతో పాటు, సామాజిక సేవను జోడించారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు మాత్రమే కేవలం వ్యవసాయాన్ని వృత్తిగా పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సామాజిక కార్యకర్త, వ్యవసాయదారునిగా చెప్పారు. తాను న్యాయవాదినని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి సివిల్ కన్‌స్ట్రక్షన్స్, కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయాన్ని వృత్తులుగా చెప్పారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ పైలట్‌నని వివరించారు.