ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వల్ల తెలంగాణ ప్రపంచ విద్యా కేంద్రంగా మారుతుందని రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. ఆర్టికల్ 371డి కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 80శాతం మంది స్థానిక విద్యార్థులే చదువుతున్నారని.. ఇక నుంచి ఇతర ప్రాంతాల విద్యార్థులు పెరుగుతారని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా మారిందని.. భవిష్యత్తులో విద్యారంగంలోనూ ఆదర్శంగా నిలుస్తుందని నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలతోపాటు.. మానసిక ఆనందాన్ని అందించే విధంగా విద్యా సంస్థలు ఉండాలన్నారు.
త్వరలో యూట్యూబ్ ఛానెల్..
ఇంటర్మీడియట్ ఫలితాల ప్రక్రియలో కృత్రిమ మేథస్సు వినియోగించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. రాష్ట్రంలోని 64 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వర్చువల్ తరగతులు నిర్వహిస్తున్నామని.. త్వరలో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్న విద్యార్థుల్లో 40శాతం మందికే ఉద్యోగాలు లభిస్తున్నాయని తెలిపారు.
కొత్త కోర్సులను ప్రవేశపెట్టేలా..
కృత్రిమ మేథస్సు, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టేలా ఇంజినీరింగ్ కాలేజీలను ప్రోత్సహిస్తున్నామని ఏఐసీటీఈ డిప్యూటీ డైరెక్టర్ నీతూ భగత్ పేర్కొన్నారు. హైదరాబాద్లో జరగుతున్న రెండు రోజుల ప్రపంచ విద్యా సదస్సులో నవీన్ మిత్తల్, సయ్యద్ ఒమర్ జలీల్, నీతూ భగత్తోపాటు.. తెలంగాణ, ఇతర రాష్ట్రాల విద్యా శాఖల ఉన్నతాధికారులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ''దేశద్రోహం' వ్యాఖ్యల అమూల్యకు నక్సలైట్లతో సంబంధం'