హైదరాబాద్ శివారు మచ్చ బొల్లారానికి చెందిన బాలుడు రౌనక్ రాజ్‌సింగ్ సహానీ... తైక్వాండో, అథ్లెటిక్స్‌లో రాణిస్తున్నాడు. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి... రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ తైక్వాండో, రన్నింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో సత్తాచాటుతూ పతకాల పంట పండిస్తున్నాడు. 80 పైగా ఈటెంట్లలో పాల్గొని 17 బంగారు, 25 రజత, 18 కాంస్యాలతో పాటు 60 పతకాలు సాధించాడు. అతిచిన్న వయసులో 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.

రౌనక్... తండ్రి అజేందర్ సింగ్ సహాని జీవీకే ఎంఆర్‌ఐ 108 సేవల్లో సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. తల్లి సీమా ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో పీజీటీ కామర్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. రౌనక్ రాజ్‌సింగ్‌కు మెరుగైన, అత్యాధునిక శిక్షణ కోసం దక్షిణ కొరియాలోని కుక్కివాన్ ప్రపంచ తైక్వాండో అకాడమీలో శిక్షణ ఇప్పించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారు.

క్రీడల్లో రాణిస్తున్న రౌనక్... చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమన్వయం చేసుకుంటున్నాడు. బాలలకు కేంద్రం ఇచ్చే ప్రతిష్ఠాత్మక బాలశక్తి పురస్కారం కోసం రౌనక్ పేరును మేడ్చల్ జిల్లా కలెక్టర్ సిఫారసు చేశారు. ఉసేన్ బోల్టే తనకు స్ఫూర్తి అంటున్న రౌనక్... తైక్వాండోలో భారత పతాకం ఎగురవేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.

ఇదీ చూడండి: