Loan App Case in Hyderabad: లోన్ యాప్ కేసులో ఈడీ అధికారులు పలు రుణ సంస్థలకు చెందిన ఆస్తులను అటాచ్ చేశారు. 12 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు, ఫిన్ టెక్ సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న 105 కోట్ల రూపాయలను జప్తు చేశారు. ఇండిట్రేడ్ ఫిన్‌కార్ప్, అగ్లో ఫిన్ట్రేడ్తో పాటు మరో 10 సంస్థలకు చెందిన 233 బ్యాంకు ఖాతాలను గుర్తించిన ఈడీ అధికారులు.. ఆయా ఖాతాల్లోని నగదును జప్తు చేశారు. దివాలా తీసిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లతో కొన్ని ఫిన్‌టెక్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఫిన్‌టెక్ సంస్థల వెనుక కొంతమంది చైనీయులున్నట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది.
చైనా నుంచి ఫిన్‌టెక్ సంస్థల ద్వారా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లలో పెట్టుబడులు పెట్టారు. లోన్ యాప్స్ రూపొందించి... వాటి ద్వారా స్వల్పకాలిక రుణాలు ఇచ్చారు. 7 నుంచి 30 రోజుల్లో చెల్లించే విధంగా అతి తక్కువ వ్యవధిలోనే రుణాలు మంజూరు చేశారు. లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కేవలం ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ నమోదు చేస్తే రుణాలు మంజూరు చేశారు. 12 సంస్థలు కలిసి ఏకంగా 4430 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినట్లు ఈడీ అధికారులు తేల్చారు. 819 కోట్ల రూపాయల లాభం ఆర్జించినట్లు గుర్తించారు. అత్యధిక వడ్డీ వసూలు చేస్తూ రుణగ్రహీతలను పీడించారు. రుణం తిరిగి చెల్లించని వాళ్ల సామాజిక మాధ్యమ ఖాతాలను తీసుకొని వాటికి ఇష్టారీతిన సందేశాలు పంపించారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో లోన్ యాప్ ఆగడాలపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదివరకు 4 ఎన్బీఎఫ్సీలకు చెందిన 158.9 కోట్ల రూపాయలను ఈడీ అధికారులు జప్తు చేశారు. ఇప్పటి వరకు ఈడీ అధికారులు లోన్ యాప్‌ల వ్యవహారంలో మొత్తం 264.3 కోట్ల రూపాయలను జప్తు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: