పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఓటు హక్కు కోసం కొత్తగా 3 లక్షల 38 వేల 726 దరఖాస్తులు వచ్చాయని.. ఈ నెల 22న ఓటర్ల అనుబంధ జాబితా విడుదల చేయనున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల వరకు ఓటర్లు ఉండే అవకాశం ఉందని ఈసీ వెల్లడించింది.
రెండు కోట్లకు పైగా నగదు:
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా నగదు, సుమారు 4 కోట్ల విలువైన మద్యం, 2 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. ఈనెల 28 నుంచి ఫోటో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేపట్టనున్నారు. కొత్తగా ఓటుహక్కు వచ్చేవారికి గుర్తింపు కార్డులు ఉచితంగా అందిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ఫిర్యాదు
కార్డు లేని వారు మీసేవలో 25 రూపాయలు ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు తీసుకోవచ్చని రజత్ కుమార్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల కోసం 54,953 బ్యాలెట్ యూనిట్లు, 40 వేల 32 కంట్రోల్ యూనిట్లు, 41,356 వీవీప్యాట్ యంత్రాలు వినియోగిస్తున్నట్లు చెప్పారు. మొత్తం లక్షా 85 వేల 701 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. ప్రగతి భవన్లో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారన్న కాంగ్రెస్ ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు రజత్ కుమార్ పేర్కొన్నారు. శాసనసభ్యులు పార్టీలు మారడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఓటింగ్
హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతోందని రజత్ కుమార్ అన్నారు. ఈ సారైనా నగరవాసులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావాలిని విజ్ఞప్తి చేశారు. నాఓటు యాప్ ద్వారా పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చని... పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక సాప్ట్ వేర్ వినియోగిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి:జనసేన తొలి అభ్యర్థి ఖరారు