బడ్జెట్ ప్రతిపాదనల తయారీకి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఎప్పటి లాగానే సంక్షేమ బడ్జెట్ ఉండాలని.. నీటిపారుదలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా బడ్జెట్ రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పుడున్న పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆసరా ఫించన్ల మొత్తం పెంపు, 57 ఏళ్ల వయస్సు పైబడిన వారికి వృద్ధాప్య పింఛను ఇచ్చేందుకు నిధులు కేటాయించాల్సి ఉంది. నిరుద్యోగ భృతి, ఉద్యోగుల వేతనసవరణ తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
సమావేశానికి నాలుగు రోజులు సరిపోతాయనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మెుదటిరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టి, దానిపై రెండు రోజుల పాటు చర్చ జరపనుంది. చివరిరోజు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపనుంది. ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ముగించి, మార్చిలో లోక్సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు.