స్వర్ణభారత్ ట్రస్టు 18వ వార్షికోత్సవంలో రాష్ష్రపతి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటించారు. స్వర్ణభారత్ ట్రస్టు 18వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. వార్షికోత్సవానికి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని కోవింద్ అన్నారు. స్వర్ణభారత్ ట్రస్టు చేస్తున్న కార్యక్రమాలపై చాలాసార్లు విన్నానని...ట్రస్టు అందిస్తున్న సేవలను ఇవాళ ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. సాంస్క్రతిక కార్యక్రమాల ప్రదర్శనలు తనన్నెంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. సామాజిక సేవలో ముందుంటున్న స్వర్ణభారత్ ట్రస్టు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. 18 ఏళ్లుగా సేవలందించడం అభినందనీయమన్నారు.
వెంకయ్య తెలియని వారు ఉండరు
వెంకయ్యనాయుడు గురించి తెలియనివాళ్లు ఉండరని...సామాజిక సేవ కార్యక్రమాల్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారని కొనియాడారు. వెంకయ్యనాయుడు అజాత శత్రువు అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. అందరితో ప్రేమపూర్వకంగా వ్యవహరించే తత్వం వెంకయ్యదని ప్రశంసించారు. స్వర్ణభారత్ ట్రస్టు గాంధీజీ సిద్ధాంతాలను పాటిస్తోందని... గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలనకు ట్రస్టు కృషిని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.