నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్షహైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. భవిష్యత్ అవసరాల అనుగుణంగా బృహత్ ప్రణాళిక రూపొందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నగర అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ నిధులతో పాటు మరిన్ని సమకూరుస్తామని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నిపుణులతో ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రణాళికల అమలు బాధ్యత కేవలం హెచ్ఎండీఏపైనే కాకుండా ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. అందరూ భాగ్యనగరం వైపే ఆకర్షితులు కాకుండా ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రత్యామ్నాయ వ్యూహాన్ని అమలు చేస్తామని తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్కు పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయని... ఇది ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దకుంటే సమస్యలు తప్పవన్నారు. పచ్చదనం పెంచేలా భవన నిర్మాణాల అనుమతుల్లో నియంత్రణ ఉండాలని... పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలన్నింటినీ నగరం అవతలికి తరలించి... మూతపడిన పరిశ్రమల భూముల్లో పార్కులు ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో లక్షా 50వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ బ్లాకుల్లో అడవిని పునరుద్ధరించాలని తెలిపారు. మౌలిక సదుపాయాలు, విద్యా, ఆరోగ్య, రవాణా, క్రీడా, చిత్ర నగరాలు ప్రత్యేకంగా ఉండేలా భూములు కేటాయించి అనుమతులివ్వాలన్నారు. కేటాయించిన దానికే భూములు వినియోగించాలని... ఉల్లఘించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. బృహత్ ప్రణాళికలో మార్పులు చేయాలనుకుంటే మంత్రివర్గం అనుమతి తప్పనిసరి ఉండేలా చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ సంస్థలను కన్సల్టెన్సీలుగా నియమించుకొని మూడు నెలల్లో మంచి బృహత్ ప్రణాళిక రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు.