ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏడాదిగా పెద్ద పులుల సంచారం ఉన్నట్లు స్పష్టంగా వెల్లడవుతోంది. ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టడంలో అటవీశాఖ విఫలమవుతోంది. ఇటీవల కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం దిగిన అటవీ ప్రాంతంలో విగ్నేశ్ అనే యువకున్ని పెద్దపులి హతమార్చిన తరువాత కూడా అధికారులు అనుకున్న రీతిలో అప్రమత్తం కాలేదు. దాని ఫలితంగా... నవంబరు 29న పెంచికలపేట మండలం కొండపల్లిలో పత్తి తీయడానికి వెళ్లిన బాలిక పసుల నిర్మల.. బలి కావల్సివచ్చింది.
నిఘా నేత్రాలకూ చిక్కలేదు..
దిగిడ, కొండపల్లి గ్రామాల మధ్య కేవలం 11 కిలోమీటర్ల దూరమే అయినా.. పులి జాడను అటవీశాఖ తెలుసుకోలేకపోయింది. విగ్నేశ్, నిర్మలవి నిరుపేద కుటుంబాలు. ఇంతవరకు అటవీ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు ఎవరూ... ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. వారి దయనీయ స్థితిని పరిగణలోకి తీసుకోవడంలేదు. విగ్నేశ్ను హతమార్చిన తరువాత అటవీ ప్రాంతంలో 50 మంది సిబ్బంది, 30 సీసీ కెమెరాల పహారా మధ్య రెండు మేకలు, లేగదూడలతో కలిపి ప్రత్యేక బొన్లు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ ప్రకటించింది. అయినా... పులి దొరకలేదు. నిఘా నేత్రాలకు సైతం చిక్కలేదు.
కొరవడిన పర్యవేక్షణ...
ఇద్దరు మనుషుల ప్రాణాలు పోవటం వల్ల ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారే తప్ప... పులులను పట్టుకునేందుకు శాస్త్రీయ పద్ధతి పాటించలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడవిని ఆనుకొని ఉండే గ్రామీణులకు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది మధ్య మునుపటి సఖ్యత లేదు. గతంలో చౌకీదారు మొదలుకొని డివిజన్ స్థాయి అధికారి దాకా నిరంతర పర్యవేక్షణ ఉండేది. ఇప్పుడది లోపించింది. ప్రభుత్వం ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చినా... ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం... సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
నిబంధలనకు నీళ్లు...
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లావాసే అయినా... పులులు సంరక్షణ, ప్రజల భద్రతపై ఇంతవరకు ఒక్క సమీక్షా నిర్వహించలేదు. క్షేత్రస్థాయిలో పులులు, వన్యప్రాణుల సంచారం ఉందంటేనే... అటవీశాఖ యుద్ధప్రాతిపదికన అప్రమత్తం కావాల్సి ఉంటుంది. పశువులు ఇతర మూగజీవాలు చనిపోతే... పశువైద్యులు చేసే సిఫారసులకు అనుగుణంగా రెండు రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. పక్షం రోజుల్లో నష్టానికి అనుగుణంగా పరిహారం అందేలా చూడాల్సిన బాధ్యతా అధికారులదే. పంట పొలాలను ధ్వంసం చేస్తే ఎకరాకు 6 వేలకు తగ్గకుండా పరిహారం ఇప్పించాలి. పులులు, ఇతర అడవి జంతువుల దాడిలో మనుషులు గాయపడినా... మరణించినా... సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్న అటవీశాఖ ప్రాథమిక నిబంధనలను అధికారులు మర్చిపోయారన్న విమర్శలు వస్తున్నాయి.
జిల్లాల పునర్విభజన కంటే ముందు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో అటవీశాఖపై జరిగే సమీక్షల ప్రాధాన్యం.. అనంతరం తగ్గిపోయింది. ఫలితంగా విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత లోపించి అటవీ శాఖ విమర్శలు మూట కట్టుకోవల్సి వస్తోంది. ఇప్పటికైనా అటవీశాఖ అప్రమత్తమై... వన్యప్రాణులను... వాటి నుంచి ప్రజలను సంరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.