దేశవ్యాప్తంగా స్వాతంత్య్రం కోసం మహోద్యమం ఓవైపు.. తెలంగాణలో నిజాం నిరంకుశత్వానికి, రజాకార్ల ఆగడాలపై సాగుతున్న పోరు మరోవైపు. ఈ తిరుగుబాటుకు సమాంతరంగా ఆదిలాబాద్ అడవుల్లో ఓ గోండు వీరుడి పోరాటం సాగింది. 1901 అక్టోబర్ 22న ఆసిఫాబాద్ మండలంలోని సంకేపల్లిలో చిన్నూ, సోంబారు దంపతులకు కుమురం భీం జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణంతో 15వ ఏటనే గ్రామ పెద్దగా బాధ్యతలు చేపట్టారు. అక్కడి సమకాలిక సమస్యలపై అవగాహన పెంచుకున్న భీంను... అటవీ సంపద దోపిడి, మహిళలపై పట్వారీల ఆకృత్యాలు తీవ్రంగా కలిచివేశాయి.
అడవిబిడ్డల ఆత్మస్థైర్యం
ఆదివాసీలపై ఆగడాలను సహించలేక సాయుధపోరును జోడేఘాట్ గడ్డపై తుపాకీ ఎక్కుపెట్టారు కుమురం భీం. అడవిబిడ్డలను అనుచరులుగా మార్చుకుని తనదైన గెరిల్లా వ్యూహాలతో నిజాం సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. నిజాం ఆగ్రహానికి గురైన కుమురంభీం.. తనవారి ఒత్తిడి మేరకు అజ్ఞాతంలోకి వెళ్లారు. అక్కడ మొదలైన ధిక్కారస్వరం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.
జోడేఘాట్ కేంద్రంగా యుద్ధ వ్యూహాలు
గిరిజనులంతా ఏకమై జోడేఘాట్ కేంద్రంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. భీం శక్తిని గ్రహించిన నిజాం సర్కారు... దూతలతో రాజీ కోసం ప్రయత్నాలు చేసింది. భీం ఉక్కు సంకల్పం ముందు నిజాం పాచికలు పారకపోవడం వల్ల అంతమొందించేందుకు ప్రత్యేక దళాలు జోడేఘాట్‌కు చేరుకున్నాయి. భీం అనుచరుడిని లోబర్చుకుని... అతడి సమాచారం మేరకు 1940, అక్టోబర్ 13 అర్ధరాత్రి సమయంలో పోలీసులు భీంను చుట్టుముట్టారు. నిజాం సైన్యం తుపాకి గుండ్ల వర్షం కురిపించినా వీరోచితంగా పోరాడి చివరికి మృత్యుఒడికి చేరుకున్నారు.
గోండువీరుడు నేలకొరిగి 79 వసంతాలు
జల్, జంగిల్, జమీన్ నినాదంతో తన జాతి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరుసల్పిన గోండువీరుడు నేలకొరిగి నేటితో 79 వసంతాలు పూర్తి అవుతోంది. ఆదివాసీలపై అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి, అడవి బిడ్డల ఆత్మస్థైర్యాన్ని కుమురం భీం శిఖర స్థాయికి చేర్చారు.
ఇవీ చూడండి: సంచులకొద్ది బయటపడుతున్న యూరియా అమ్మకాల అక్రమాలు...