ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,508 గ్రామ పంచాయతీలు సహా 12 మున్సిపాల్టీల పరిధిలో జిల్లాల పునర్విభజన తరువాత స్తిరాస్థి వ్యాపారం తారాస్థాయికి చేరుకుంది. నిబంధనల ప్రకారమైతే కొత్తగా లేఅవుట్ చేయాలంటే తప్పనిసరిగా హైదరాబాద్, వరంగల్ కేంద్రంగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) అనుమతి తీసుకోవాలి. అనుమతిలేకుండా చేసిన లేఅవుట్లన్నీ అనధికార లేఅవుట్లుగానే ప్రభుత్వం గుర్తిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 924 అనధికారిక లేఅవుట్లు ఉన్నట్లుగా అధికార యంత్రాంగం గుర్తించింది. వీటిని క్రమబద్ధీకరించుకునేందుకు ఇప్పటికే 7,759 దరఖాస్తులు రాగా, మరోపక్క 12 మున్సిపాల్టీల పరిధిలో 25,759 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రజాప్రతినిధులు, వారి అనుచరలు, బినామీలు ఎంతమంది ఉంటారనే దానిపై అంతర్గతంగా జోరుగా చర్చ జరుగుతోంది.
ఇప్పుడు దరఖాస్తుల సంఖ్యే..
సెప్టెంబర్ 5 నుంచి ఆన్లైన్లో ప్రారంభమైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 15 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత గడువు పెరగనుందా లేదా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం దరఖాస్థుల వివరాలన్నీ ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్లోనే నిక్షిప్తమవుతుండగా... జిల్లా స్థాయిలో కేవలం దరఖాస్తుల సంఖ్యే తెలుస్తోంది. ఫలితంగా వ్యక్తిగతంగా వివరాలు వెల్లడయ్యే అవకాశం లేదు. ఒకవేళ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన తరువాత వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తే ప్రతి ఒక్కరి ఆస్తుల వివరాలు తెలిసే వీలుంది.
అక్టోబరు 15 తర్వాతే..
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలలో స్తిరాస్థి దందాలో కొంతమంది ప్రజాప్రతినిధుల పాత్ర ఉంది. మరికొంతమంది బినామీలతో చక్రం తిప్పుతున్నారు. ఈనెల 15న దరఖాస్తుల స్వీకరణ తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారమే ఎవరి పేరిట ఎన్ని ప్లాట్లు ఉన్నాయి...? అనే విషయం వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండిః 8 లక్షలు దాటిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు