Heavy Rains in Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వర్షం వీడటంలేదు. నాలుగో రోజు సైతం మోస్తరుగా వర్షం కురుస్తూనే ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలను ముసురు వీడటం లేదు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో అత్యధికంగా 13.36సెంమీ వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 34.8 మీమీ వర్షం కురవగా.. అత్యధికంగా మామడ మండలంలో 65.2 మీమీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా.. వాగులు, వంకలు పొటెత్తుతున్నాయి. ఫలితంగా ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద వల్ల పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి.
నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కిషన్రావుపేటలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. గండిపడిన చెరువును పరిశీలించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పోలాలను పరిశీలించి రైతుల పరిస్థితిని నేరుగా తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిర్మల్ జిల్లాలో సగటున 22 సెంటిమీటర్ల భారీ వర్షం కురవడం వల్ల అతలాకుతలమైందన్నారు. చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని, రోడ్లు దెబ్బతిన్నాయని, విద్యుత్ అంతరాయం కలిగిందని, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వివరించారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వీలైనంత సహాయం అందిచాలన్నారు.
భారీ వర్షానికి మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కోటపల్లి మండలంలో తుంతుంగా వాగు ప్రవాహానికి రహదారి కొట్టుకుపోవడంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎదుళ్లబంధం, సిర్సా, పుల్లగమ, రొయ్యలపల్లి, ఆలగమ, జనగామ, సూపక, వెంచపల్లి, నందరంపల్లి, శివరాంపల్లి తదితర గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం నీటి సామర్థ్యం 20 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 13.19టీఎంసీలకు చేరుకుంది. ఎగువనుంచి వరద పోటెత్తటంతో 1.52 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువను వదులుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయం నీటిసామర్థ్యం 700 అడుగులకు గానూ 693 అడుగులకు చేరుకుది. 7 వరద గేట్ల ద్వారా 54576 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్వర్ణ జలాశయం సామర్థ్యం 1183 అడుగులకు గానూ ప్రస్తుతం 1179 అడుగులకు చేరుకుంది. 1300 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా.. ఒక గేట్ ఎత్తి 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా మత్తడివాగు, సాత్నాల ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జలపాతాలు ఉప్పొంగుతుండటం వల్ల కలెక్టర్ల ఆదేశాల మేరకు అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. లింగాపూర్లోని సప్తగుండాల, మిట్ట, చింతల మదర జలపాతాల సందర్శనను తాత్కాలిక రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి జలపాతల సందర్శనకు రావొద్దని సూచించారు. మరోవైపు మంచిర్యాల, కుమురంభీం జిల్లాల పరిధిలో అయిదు సింగరేణి ఉపరితల గనుల్లో నాలుగు రోజుల్లో 66.160 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పత్తి, సోయా పంటలపై ప్రభావం పడుతోంది.
ఇవీ చూడండి: