ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఇది వరకు 39 వార్డులుండగా... కొత్తగా పెరిగిన 13 వార్డులతో కలిపి 49 అయ్యాయి. 1.55 లక్షలపైచిలుకు జనాభా ఉన్న పట్టణాభివృద్ధి కుంటుపడింది. రహదారులు, మురికి కాలువలు, కల్వర్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం 2017 చివరలో రూ. 27 కోట్లు, 2018లో మరో రూ. 28 కోట్లు విడుదల చేసింది. మున్సిపల్, ఆర్‌అండ్‌బీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఇంకా పనులు పూర్తి కాలేదు. ఫలితంగా చినుకు పడితే చిత్తడిగా మారుతున్న రహాదారులతో... ప్రజలు రోజూ నరకం చూడాల్సివస్తోంది.
మావల నుంచి చాందా(టి) వరకు ఉన్న పాత జాతీయ రహాదారిపై వెడల్పు, సెంట్రల్ లైటింగ్ కోసం మరో రూ. 44 కోట్లను మంజూరుచేసినప్పటికీ... పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. ప్రధాన వ్యాపార, వాణిజ్య కేంద్రాలతోపాటు శివారు కాలనీల్లోనూ మురికి కాలువల వ్యవస్థ అధ్వాన్నంగా మారింది. తెరుచుకున్న మ్యాన్‌హోల్స్ ప్రమాదాలకు దారితీస్తున్నప్పటికీ... అధికార యంత్రాంగంలో మాత్రం చలనం లేదు.
అనుకూలురైన వ్యక్తుల ప్రయోజనాల కోసం రాత్రికి రాత్రే పనుల చేయాలని గుత్తెదారులకు మౌఖిక ఆదేశాలు ఇస్తున్న అధికారులు... అత్యవసరమనుకున్న పనులను పట్టించుకోవడం లేదు. ఫలితంగా నూతనంగా ఏర్పడిన మున్సిపల్ పాలకవర్గం సైతం అబాసుపాలు కావాల్సివస్తోంది.
ఇదీ చూడండి: కడంబా అడవుల్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి