కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి, గోలేటి క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలు అధ్వాన్నంగా ఉన్నాయి. కరోనా సోకిన వారిని కేంద్రాలకు పంపిన అధికారులు.. వాటి నిర్వహణను గాలికి వదిలేశారని అక్కడ ఉంటున్నవారు వాపోతున్నారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. గదులను శుభ్రం చేయకుండానే కరోనా బాధితులను అందులోకి పంపారు. కొంతకాలంగా పాఠశాల మూతపడగా అంతా చిందరవందరగా మారింది. పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. వసతి గదుల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది.
నాణ్యత లేని భోజనం
ఈ పరిస్థితుల్లో రోగులు కష్టాలు పడుతున్నారు. తాగేందుకు నీళ్లు లేవని, మరుగుదొడ్లు సరిగా లేవని.. దోమలు, ఈగల బెడద తీవ్రంగా ఉందని వాపోతున్నారు. నాణ్యతలేని భోజనం అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సమయానికి మందులు కూడా ఇవ్వడంలేదని మెరపెట్టుకుంటున్నారు. ఆరుబయటే స్నానాలు చేయాల్సి వస్తోందని.. టాయిలెట్‌లో కనీసం బకెట్ కూడా లేదని చెబుతున్నారు.
ఇంటికెళ్తాం.. అనుమతివ్వండి
తమను వదిలేస్తే ఇంటికి వెళ్లిపోతామని వేడుకుంటున్నారు. పలువురు కరోనా బాధితులకు కనీసం మాస్కులు, శానిటైజర్లు కూడా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. సౌకర్యాలు లేని చోట క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయడంపై బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని తమ ఇళ్లకు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: చితికిపోతున్న జీవనం.. పైసల్లేక పల్లెలకు పయనం