WPI inflation: దేశంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) రికార్డు స్థాయికి చేరింది. మే నెలలో అత్యధికంగా 15.88 శాతంగా నమోదైంది. ఇంధన, ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఏప్రిల్‌లో ఇది 15.08 శాతంగా ఉంది.
మరోవైపు.. ఆహార వస్తువులు, ఇంధన ధరలు కాస్త శాంతించడంతో మే నెలలో రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం 7.04 శాతానికి దిగొచ్చింది. ఏప్రిల్‌లో ఇది 7.79 శాతంగా నమోదైంది. 2021 మేలో ఇది 6.3 శాతంగా ఉంది. వరుసగా 5వ నెలా రిటైల్ ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత స్థాయి 2-6 శాతం కంటే అధికంగానే నమోదు కావడం గమనార్హం. ఈ మేరకు జాతీయ గణాంకాల కార్యాలయం సోమవారం వివరాలు విడుదల చేసింది.
ఆర్‌బీఐ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.5 శాతంగా నమోదు కావొచ్చు. ఆ తర్వాత 3 నెలలు 7.4 శాతంగా ఉండొచ్చు. మూడో త్రైమాసికంలో 6.2 శాతానికి, నాలుగో త్రైమాసికంలో 5.8 శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ ఉంది. 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా నమోదు కావచ్చని గతంలో అంచనా వేయగా, ఇటీవల దాన్ని 6.7 శాతానికి సవరించింది.
ఇవీ చూడండి: అమెజాన్‌కు షాక్.. రూ.202 కోట్ల జరిమానా కట్టాల్సిందే..
జీవిత ప్రయాణం సాఫీగా సాగాలంటే.. ఆర్థిక ప్రణాళిక వేసుకోండిలా...