బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్ కోడ్ల గురించి చాలామంది వినే ఉంటారు. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలు, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో ఐఎఫ్ఎస్సీ కోడ్ అవసరమవుతుంది. చాలా మంది ఈ కోడ్ గురించి వెతుకుతుంటారు. మీ బ్యాంకు పొదుపు ఖాతా పాస్‌బుక్ మొదటి పేజీలో ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్ కోడ్లు ముద్రించి ఉంటాయి. అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు.
ఐఎఫ్ఎస్సీ అంటే ఏంటి?
- ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్.. దీన్ని సాధారణంగా ఐఎఫ్ఎస్సీ కోడ్ అని పిలుస్తారు. ఇది 11 అక్షరాలు, అంకెల కలయికతో వచ్చే ప్రత్యేకమైన కోడ్. వేర్వేరు బ్రాంచ్ శాఖలకు వేర్వేరుగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆర్బీఐ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకూ ఈ కోడ్ ఇస్తుంది.
- ఐఎఫ్ఎస్సీ కోడ్ అనేది నిర్దిష్ట బ్యాంకు బ్రాంచీని కనుక్కోవడంలో సాయపడుతుంది. అలాగే, నిధుల బదిలీలో తప్పులు జరగకుండా ఉపయోగపడుతుంది. అందువల్ల నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ వంటి ఎలక్ట్రానిక్ పేమెంట్స్‌లో తప్పనిసరిగా ఐఎఫ్ఎస్సీ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది.
- ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు నిధులు బదిలీకి ఈ కోడ్ తప్పనిసరి. ప్రతి బ్యాంకు బ్రాంచీకి ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. రెండు వేరు వేరు బ్యాంకులకు ఒకే కోడ్ ఎప్పుడూ ఉండదు. అలాగే ఒకే బ్యాంకు అయినా వేరు వేరు బ్రాంచుల కోడ్లు వేరువేరుగా ఉంటాయి. ఐఎఫ్ఎస్సీ కోడ్‌లో మొదటి 4 అక్షరాలు బ్యాంకును సూచిస్తాయి. చివరి 6 అంకెలు శాఖను సూచిస్తాయి. 5వ అక్షరం సున్నాగా ఉంటుంది.
- ఉదాహరణకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తీసుకుంటే సోమాజిగూడ హైదరాబాద్ బ్రాంచీ ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN0031625. ఇందులో మొదటి నాలుగు అక్షరాలు 'SBIN' బ్యాంకును, 031625 బ్రాంచి కోడ్‌ను సూచిస్తాయి.
ఎంఐసీఆర్ అంటే ఏంటి?
- మాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీ (ఎంఐసీఆర్) ఉపయోగించి చెక్కులపై ముద్రించిన కోడ్‌ను ఎంఐసీఆర్ కోడ్ అంటారు. ఇది చెక్‌లను గుర్తించేందుకు, వేగవంతంగా ప్రాసెస్ చేసేందుకు సాయపడుతుంది. అంతేకాకుండా ప్రత్యేక మాగ్నెటిక్ ఇంక్‌తో ముద్రించడం వల్ల నకిలీలను, డూప్లికేషన్‌ను మాగ్నెటిక్ స్కానర్ ద్వారా సులభంగా గుర్తిస్తుంది.
- ఎంఐసీఆర్ కోడ్ 9 అంకెల కోడ్. ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసీఎస్)లో పాల్గొనే బ్యాంకు, శాఖను ప్రత్యేకంగా గుర్తిస్తుంది. ఇందులో 3 భాగాలు ఉంటాయి. మొదటి మూడు అంకెలు నగరాన్ని(సిటీ కోడ్) సూచిస్తాయి. భారతదేశంలో పోస్టల్ చిరునామాల్లో ఉపయోగించే పిన్ కోడ్‌ను బట్టి ఇది ఉంటుంది. తదుపరి 3 అంకెలు బ్యాంకు కోడ్‌ను, చివరి 3 అంకెలు బ్రాంచీ కోడ్‌ను సూచిస్తాయి.
- ఎంఐసీఆర్ కోడ్ చెక్ లీఫ్ కింది భాగంలో చెక్ నంబరు పక్కన ఉంటుంది. బ్యాంకు పొదుపు ఖాతా పాస్ పుస్తకం మొదటి పేజీలో కూడా ఎంఐసీఆర్ కోడ్ ప్రింట్ చేసి ఉంటుంది.
ఎంఐసీఆర్ ఎక్కడ అవసరం?
పెట్టుబడులకు సంబంధించిన ఫారంలు, సిప్ ఫారం, నిధులు బదిలీ చేయడం వంటి వివిధ ఆర్థిక లావాదేవీల ఫారాలను ఫైల్ చేసేటప్పుడు ఎంఐసీఆర్ కోడ్‌ను పేర్కొనాల్సి ఉంటుంది.
చెక్ నంబర్ అంటే?
ప్రతి చెక్ లీఫ్‌కు ప్రత్యేకంగా కేటాయించిన 6 అంకెల సంఖ్యను చెక్ నంబరు అంటారు. ఇది చెక్కు దిగువన ఎడమ వైపున ఉంటుంది. మీరు బ్యాంకు నుంచి కొత్త చెక్ బుక్‌ను అందుకున్నప్పుడు అందులో ప్రతి లీఫ్లోని నంబరును తనిఖీ చేయాలి. దీనివల్ల చెక్కు మిస్ అవ్వకుండా జాగ్రత్త పడొచ్చు. అలాగే, ప్రతి చెక్ బుక్ ప్రారంభంలో, చివరిలో లావాదేవీ రికార్డు స్లిప్ ఉంటుంది. చెక్ లీఫ్ ఉపయోగించినప్పుడు లావాదేవీని ఇక్కడ రికార్డు చేయాలి. ఈ రికార్డులో చెక్ నంబరు, తేదీ, మొత్తం, చెల్లింపుదారుని వివరాలు ఉంటాయి. ఇవి భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ఉపయోగపడతాయి.